ఆపరేషన్ థియేటర్లలో హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరించడంతో కనీసం హిజాబ్ లాంటి లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కేరళ తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ముస్లిం విద్యార్థులు ప్రిన్సిపాల్ కు లేఖ రాశారు. జూన్ 26న ప్రిన్సిపాల్ డాక్టర్ లిన్నెట్ జె మోరిస్‌కు లేఖ మెడికల్ కాలేజీ విద్యార్థుల బృందం రాసింది.ఈ లెటర్ పై వివిధ బ్యాచ్‌లకు చెందిన మరో ఆరుగురు వైద్య విద్యార్థినిలు సంతకం చేశారు. ముస్లిం మహిళలు ఏ పరిస్థితుల్లో అయినా హిజాబ్ ధరించడం తప్పనిసరి అని విద్యార్థులు లేఖలో రాశారు. అయితే ఆపరేషన్ థియేటర్ లోపల తల కప్పుకుని వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. అందుకే కనీసం హిజాబ్ లాంటి లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
హిజాబ్ లాంటి లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు రాసిన లేఖను కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లినెట్ జె మోరిస్ ధృవీకరించారు. అయితే ఆపరేషన్ థియేటర్లో ఫుల్ హ్యాండ్ గౌన్ ధరించడం కరెక్ట్ కాదని ప్రిన్సిపాల్ అన్నారు. రోగులకు ట్రీట్ మెంట్ చేసే సమయంలో తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. లేదంటే అంటువ్యాధులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థినిల లేఖపై చర్చించేందుకు సర్జన్లు, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ టీమ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు చేసిన అభ్యర్థనపై ఈ బృందం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.