కేరళలో జాతీయ జెండాకు అవమానం జరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసరగోడ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర పోర్టులు, ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, కార్యక్రమానికి హాజరైన అధికారులు, అతిథులు తలకిందులుగా ఉన్న జెండాకు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత మంత్రి ఉపన్యాసాన్ని కూడా ప్రారంభించారు. కాసేపటికి జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని గ్రహించిన కొందరు జర్నలిస్టులు విషయాన్ని అధికారుల దృృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు.
మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో జాతీయ జెండాకు అవమానం జరగడంపై కేరళ ప్రతిపక్ష పార్టీ బీజేపీ మండిపడింది. జెండా తలకిందులుగా ఉందన్న విషయాన్ని గ్రహించకుండా త్రివర్ణ పతాకాన్ని అవమానించిన మంత్రి వెంటనే పదవికి రాజనామా చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ డీజీపీ దర్యాప్తునకు ఆదేశించారు.