అమెరికాలో దారుణ హత్యకు గురైన కేరళ నర్సు కేసులో నిందితుడికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కేరళ కొట్టాయంలోని మోనిపల్లికి చెందిన మెరిన్ జాయ్ (27), ఆమె భర్త ఫిలిప్ మాథ్యూ (34) అమెరికాలో నివాసం ఉండేవారు. మెరిన్ జాయ్ దక్షిణ ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లో గల బ్రోవార్డ్ హెల్త్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తుండేది. అయితే.. ఈ దంపతులు కొన్నాళ్ల పాటు గొడవలు జరిగాయి.
ఈ క్రమంలోనే తన భార్య మెరిన్ జాయ్ ను చంపాలని భర్త ఫిలిప్ మాథ్యూ ప్లాన్ చేసుకున్నాడు. 2020 జులై 28వ తేదీ మంగళవారం రోజు మెరిన్ జాయ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది. అక్కడే వేచి ఉన్న తన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు.17 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఆమె పని చేస్తున్న ఆస్పత్రిలోని పార్కింగ్ స్థలంలో జరిగింది.
ఈ కేసును అప్పట్లో చాలా సీరియస్ గా తీసుకున్న ఫ్లోరిడా పోలీసులు.. అన్ని కోణల్లో దర్యాప్తు చేపట్టారు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. మృతురాలి భర్తే మెరిన్ జాయ్ ను చంపాడని తేలింది. కుటుంబ కలహాలతో తానే ఈ హత్య చేశానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఆ తర్వాత నిందితుడు ఫిలిప్ మాథ్యూను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో యూఎస్ కోర్టు నిందితుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది.