అంబులెన్స్​కు దారివ్వని కారు డ్రైవర్..రూ.2.5 లక్షల ఫైన్

అంబులెన్స్​కు దారివ్వని కారు డ్రైవర్..రూ.2.5 లక్షల ఫైన్
  • డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసిన కేరళ పోలీసులు
  • సోషల్ మీడియాలో వైరల్​గా మారిన వీడియో

త్రిస్సూర్​(కేరళ): అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తీసుకెళుతోందా అంబులెన్స్.. హైవేపై వేగంగా వెళుతుండగా ముందు వెళుతున్న కారు డ్రైవర్​ మాత్రం సైడ్ ఇవ్వలేదు. ఓవైపు అంబులెన్స్ సైరెన్ మోగుతున్నా, పదే పదే హారన్ కొడుతున్నా కారు డ్రైవర్​ పట్టించుకోలేదు. దాదాపు రెండు నిమిషాలకు పైగా సైడ్ ఇవ్వకుండా అలాగే వెళ్లాడు. ఇదంతా అంబులెన్స్ లో డ్రైవర్ పక్కన కూర్చున్న సిబ్బంది ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. 

కేరళలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి రోగిని తీసుకెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని వీడియోలో చెప్పాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడం, పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఓనర్ ఇంటికి వెళ్లారు. అంబులెన్స్​కు దారివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.2.5 లక్షల ఫైన్ విధించారు. దీంతో పాటు ఆ కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్​ను రద్దు చేశారు. 

కాగా, సోషల్ మీడియాలో వైరల్​గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓవైపు అంబులెన్స్ సైరన్ వినిపిస్తున్నా సైడ్‌‌ ఇవ్వకపోవడం క్షమించరాని నేరమని, సదరు డ్రైవర్ పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపించాలని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి మానవత్వం లేని వ్యక్తులు ఉండాల్సింది జైలులోనే తప్ప బయట కాదని అంటున్నారు.