హత్య కేసులో 19 ఏండ్ల తర్వాత.. నిందితులను పట్టిచ్చిన AI

  • టెక్నాలజీ సాయంతో ట్రిపుల్ మర్డర్ మిస్టరినీ ఛేదించిన కేరళ పోలీసులు 

తిరువనంతపురం:  కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో 19 ఏండ్ల నాటి ట్రిపుల్ మర్డర్ మిస్టరీని ఛేదించారు. 2006లో  ఓ మహిళను, ఆమె నవజాత కవల పిల్లలను చంపిన  నిందితులు దివిల్ కుమార్, రాజేశ్​ను అరెస్ట్ చేశారు. 

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఆర్మీ  ఆఫీసర్ దివిల్ కు 2005లో రంజిని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం చేశారు.  రంజిని ప్రెగ్నెంట్ కావడంతో అతడు మొహం చాటేశాడు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేసింది. 

దివిల్ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని కమిషన్ ఆదేశించింది.  ఈ క్రమంలో దివిల్‌‌ పఠాన్‌‌కోట్‌‌కు మకాం మార్చాడు. అక్కడ ఆర్మీలోని తన మిత్రుడు రాజేశ్‌‌ను సంప్రదించాడు.  ఇద్దరూ కలిసి రంజిని, ఆమె కవల పిల్లల హత్యకు ప్లాన్ రెడీ చేశారు.

 ప్లాన్ లో భాగంగా రంజనిని కలిసిన రాజేశ్.. తనను అనిల్ కుమార్‌‌గా పరిచయం చేసుకున్నాడు. అండగా ఉంటానని నమ్మబలికాడు. 2006 ఫిబ్రవరి 10న రంజిని రంజిని, ఆమె ఇద్దరు కవల పిల్లలను రాజేశ్, దివిల్ హత్య చేసి పరారయ్యారు.

ఇలా దొరికారు.. 

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ఎంత గాలించినా దొరకలేదు. ఇద్దరూ చాలా కాలం పరారీలో ఉండటంతో హైకోర్టు 2010లో ఈ కేసును సీబీఐ అధికారులు విచారణ చేయాలని ఆదేశించింది. అయినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. 

అయితే, ఇటీవల పోలీసులు నిందితుల పాత ఫొటోలను వెలికి తీశారు. పాత ఫొటోల ఆధారంగా వారు ఇప్పుడు ఎలా ఉంటారన్నది ఊహిస్తూ ఏఐ సాయంతో కొత్త  ఫొటోలను రెడీ చేశారు.  ఆ ఫొటోల ఆధారంగా సోషల్ మీడియాలో వెతకటం స్టార్ట్ చేశారు.

 ఈ క్రమంలోనే  ఓ పెండ్లి ఫొటో పోలీసుల దృష్టిలో పడింది. అందులోని ఓ వ్యక్తి.. ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుల్లో ఒకరైన రాజేశ్ తో 90 % మ్యాచ్ అయ్యాడు. పుదుచ్చేరిలో అతడిని అదుపులోకి తీసుకోగా అతడు రాజేశ్ గానే తేలింది. 

అతడిని విచారించిన పోలీసులు మరో నిందితుడు  దివిల్ ను కూడా ఈ నెల 4న అరెస్ట్ చేశారు. ఇలా నేరం జరిగిన 19 ఏండ్ల తర్వాత ఏఐ సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.