సబ్ జూనియర్ యూత్ నేషనల్ సాఫ్ట్ బేస్ బాల్ విజేతగా కేరళ

సబ్ జూనియర్ యూత్ నేషనల్ సాఫ్ట్  బేస్ బాల్ విజేతగా కేరళ

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ గ్రౌండ్‎లో ఈ నెల 24న ప్రారంభమైన 9వ సబ్  జూనియర్ యూత్ నేషనల్ సాఫ్ట్  బేస్ బాల్ బాల, బాలికల పోటీలు గురువారం ముగిశాయి. 12 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్  సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, కలెక్టర్  కుమార్ దీపక్, సీబీ సీఐడీ రిటైర్డ్  అడిషనల్ ఎస్పీ, సాఫ్ట్  బేస్ బాల్ స్టేట్  ప్రెసిడెంట్ పులియాల రవికుమార్  బహుమతులను అందజేసి అభినందించారు. 

ఈ పోటీల్లో సబ్  జూనియర్స్ బాలబాలికలు, యూత్  మెన్స్, ఉమెన్స్  ఓవరాల్ చాంపియన్ షిప్‎ను కేరళ కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానంలో మహారాష్ట్ర, తృతీయ స్థానంలో  తెలంగాణ జట్లు నిలిచాయి. నేషనల్​గేమ్స్ జాతీయ కార్యదర్శి నాందేవ్  జగన్నాథ్  షిండే, కాంగ్రెస్  లీడర్లు మనిమంద రమేశ్, నాతరి స్వామి, సాఫ్ట్  బేస్ బాల్  స్టేట్​ సెక్రటరీ దుర్గం గురువేందర్ సింగ్  పాల్గొన్నారు.

వాలీబాల్​లో విజేతగా యూపీ..

కోస్గి: నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఐదు రోజులుగా జరిగిన జాతీయ వాలీబాల్ అండర్–19 టోర్నమెంట్ బాలుర విభాగంలో గుజరాత్ జట్టుపై ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‎లో 33 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్​చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి విజేతలకు ట్రోఫీ, మెడల్స్​ అందజేశారు. 

ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొంటే మానసిక ఎదుగుదలతోపాటు స్పోర్ట్స్  కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. కాడా స్పెషల్​ ఆఫీసర్​ వెంకట్​రెడ్డి, డీవైఎస్ వో వెంకటేశ్​శెట్టి పాల్గొన్నారు. యూపీ జట్టు క్రీడాకారులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు వేణుగోపాల్, మన్నె బస్వరాజ్ యాదవ్​ శాలువాలు కప్పి సన్మానించారు.

ఆకట్టుకున్న ‘ఆకాశ్’

కోస్గి పట్టణంలో జరిగిన వాలీబాల్  పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన రాజస్థాన్  జట్టు క్రీడాకారుడు ఆకాశ్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 7.2 అడుగుల పొడవు ఉన్న ఆకాశ్​తో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, స్థానికులు కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.