గర్భిణి కడుపులో కర్చీఫ్.. ఇలాంటి ఘటనలు సహజమే : సంజయ్ కుమార్

గర్భిణి కడుపులో కర్చీఫ్.. ఇలాంటి ఘటనలు సహజమే : సంజయ్ కుమార్

జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణి కడుపులో డాక్టర్లు కర్చీఫ్​ వదిలేసిన ఘటనపై ఆ జిల్లా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైనాయని ఆయన చెప్పారు. కాకపోతే అప్పుడప్పుడు వైద్యం వికటించడం లాంటివి జరగడం సహజమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ అనేది ఒక్క డాక్టర్ తో అయ్యే పని కాదని, అతని కింద టీం ఉందని చెప్పారు. ఏం జరిగినా కేవలం డాక్టర్ తప్పే ఉందని అనుకోవద్దని తెలిపారు. కానీ ప్రస్తుతం అవన్నీ సవరిస్తున్నామన్నారు.

ఇటీవల పేపర్లో వచ్చిన ఈ ఘటన కూడా ఎప్పుడో రెండేళ్ల కింద జరిగిన చిన్న పొరపాటని సంజయ్ కుమార్ అన్నారు. దానికి ప్రత్యేకించి డాక్టర్లే కారణం అనుకోవద్దని, దానికి కారణం సిబ్బంది అని చెప్పారు. కడుపులో నుంచి రక్తం వచ్చేటప్పుడు దాన్ని క్లీన్ చేసే బాధ్యత పక్కనున్న సిస్టర్లదేనని, ఎన్ని గుడ్డలు పెట్టారు, ఏంటీ అని లెక్కబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనని తెలిపారు. ఇది సమిష్టిగా చేయవలసిన పని అని ఆయన అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సంజయ్ కుమార్.. ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి పెరిగిందని, అందుకే ఈ తరహా ఘటనలు ఒకటి, రెండు ఘటనలు నమోదవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు బాగానే ఉన్నాయని, ఏమైనా తప్పులు జరిగితే సవరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తేనే ఏదో అవుతుందని అనుకోవద్దని సంజయ్ కుమార్ చెప్పారు.