మహబూబాబాద్జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయి వడ్ల కొనుగోళ్లు జరిగాయి. వడ్ల రాసులతో మార్కెట్ పరిసరాలు కిక్కిరిశాయి. కవర్ షెడ్లు నిండిపోవడంతో ఓపెన్ యార్డులోనూ వడ్లను కుప్పలుగా పోశారు. శని, ఆదివారం మార్కెట్ కు సెలవు కావడంతో సోమవారం ఒక్కరోజే 768 మంది రైతులు 42,993 బస్తాల్లో 27,943 క్వింటాళ్ల వడ్లు తీసుకొచ్చారు. 454 మంది రైతులు అత్యధికంగా 17,063 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం వడ్లు తెచ్చారు.
నలుగురు రైతులు 136 క్వింటాళ్ల బీపీటీ రకం, 275 మంది 847 క్వింటాళ్ల హెచ్ఎంటీ రకం, 35 మంది 897 క్వింటాళ్ల జైశ్రీరాం రకం వడ్లు తీసుకొచ్చారు. ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్గరిష్టంగా రూ.3,159, కనిష్టంగా రూ.2 వేలు, సగటున రూ.2,928 పలికింది. బీపీటీ రకం గరిష్టంగా రూ.2,840, కనిష్టంగా రూ.2,125, సగటున రూ.2125, హెచ్ఎంటీ రకం గరిష్టంగా రూ.3,259, కనిష్టంగా రూ.2,002, సగటున రూ.2,979, జైశ్రీరాం రకం వడ్లను గరిష్టంగా రూ.3,301, కనిష్టంగా రూ.2,009, సగటున రూ.2,989 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే సోమవారం వచ్చిన సగం మాత్రమే కాంటాలు పూర్తయ్యాయి. మిగిలిన వడ్ల కాంటాల కోసం మంగళవారం మార్కెట్ కు సెలవు దినంగా ప్రకటించారు.
వెలుగు, నెల్లికుదురు(కేసముద్రం)