తొలగింపు ప్రక్రియ ముందుకు సాగుతలేదు

తొలగింపు ప్రక్రియ ముందుకు సాగుతలేదు

నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్, వెలుగు: నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కేసరి సముద్రం చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌, బఫర్ జోన్‌‌‌‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  ఎన్జీటీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి నెల దాటినా మున్సిపల్‌‌‌‌, రెవెన్యూ, ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. కొన్ని నిర్మాణాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్‌‌‌‌ కూలగొట్టి, గోడలకు రంధ్రాలు పెట్టి చేతులు దులుపుకున్నారు. మిగతావి నిర్మాణాలపై అక్రమణదారులు కోర్టుకు వెళ్లారని దాటవేస్తున్నారు. 

మొత్తం 41 అక్రమ కట్టడాలు  

కేసరి సముద్రం చెరువు ఎఫ్‌‌‌‌టీల్‌‌‌‌, బఫర్ జోన్‌‌‌‌ పరిధిలో కొందరు నేతలు పెద్దపెద్ద బంగ్లాలు, గెస్ట్ హౌజులు కట్టుకున్నారు. దీనిపై 2020లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌‌‌‌ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించి..  చెరువులోకి నీళ్లు రాకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆధారాలు సమర్పించారు. పరిశీలించిన  ట్రిబ్యునల్ ఆక్రమణలు తేల్చేందుకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది.  మూడు సార్లు సర్వేలు చేసిన ఈ కమిటీ 41 అక్రమ కట్టడాలు గుర్తించి రిపోర్టు ఇచ్చింది.  అనంతరం ఎన్జీటీ ఆదేశాల మేరకు  నాగర్ కర్నూల్ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. అయితే  23 కట్టాలకు సంబంధించి ఆయా వ్యక్తులు  కోర్టుకు వెళ్లారు. 

ఆగస్టు 17న జడ్జిమెంట్  

జాయింట్ కమిటీ  రిపోర్టును పరిశీలించిన ఎన్జీటీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉదయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. దీంతో ఆయన  ఏప్రిల్ 22న  చెరువు పరిసరాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించారు.  అక్రమ కట్టడాలపై కొందరు కోర్టుకు వెళ్లారని,  కౌంటర్లు సబ్మిట్ చేసి.. మున్సిపాలిటీ ద్వారా నోటీసులు ఇచ్చి సాధ్యమైనంత త్వరగా వాటిని తొలగిస్తామని అందులో పేర్కొన్నారు.  పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ ఆగస్ట్ 17న ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.  కేసరి సముద్రంతో పాటు పుట్నాల కుంట, సద్దలసాబ్ కుంట, తుమ్మలకుంటలోకి నీరు రాకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది.   ఎన్విరాన్మెంటల్ పెనాల్టీలు విధించడంతో పాటు చట్టం అనుమతించిన మేరకు చర్యలు తీసుకోవచ్చని సూచించింది. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌, బఫర్ జోన్లను సైంటిఫిక్ పద్ధతిలో గుర్తించి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. 

నామ్‌‌‌‌ కే వాస్తేగా కూల్చివేతలు

ఎన్జీటీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీం, ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ స్క్వాడ్ కూల్చివేతలు చేపట్టినా.. నామ్కేవాస్తే అన్నట్లు కానిచ్చారు.   కొన్నిచోట్ల కాంపౌండ్ వాల్స్‌‌‌‌, గోడలకు రంధ్రాలు చేసి.. 11 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. మిగతావి కోర్టు పరిధిలో ఉన్నట్లు చెప్పారు.  కాగా, హైకోర్టులో ఉన్న కేసులకు ఇప్పటికే క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం.  ఇతర కోర్టుల నుంచి క్లియరెన్స్ తీసుకుంటామని ప్రకటించిన మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు.   రియల్ మాఫియా, రాజకీయ నేతల ఒత్తిడితోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.