లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలివ్వండి..టీజీసీహెచ్​కి ​ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఆదేశం

లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలివ్వండి..టీజీసీహెచ్​కి ​ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో ఎమ్మెల్సీ కోదండరామ్, విద్యా కమిషన్ చైర్మన్ ఆనుకూరి మురళి, కమిషన్ సభ్యుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వం ఇటీవల వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించిన గైడ్​ లైన్స్ ఇచ్చింది.

దీంతో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాట పట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై అధికారుల మధ్య చర్చ జరిగింది. అయితే, నిబంధనల ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని కౌన్సిల్ చైర్మన్ వివరించారు. దీంతో ఇతర మార్గాల ద్వారా వారికి ఎలా న్యాయం చేయొచ్చనే దానిపై రెండు, మూడు ప్రతిపాదనలతో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బాలకిష్టారెడ్డిని కేశవరావుఆదేశించారు.