- ఇయ్యాల దర్బార్.. మంత్రులు సత్యవతి, ఐకే రెడ్డి రాక
- విద్యా సంస్థలకు సెలవు
గుడిహత్నూర్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు మూడో రోజు భక్తులు పోటెత్తారు. తెలంగాణ తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న గిరిజనులతో జాతర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దాదా బగ మంతి.. నన్ ఇన్కే నాగోబా పేన్ లాసి కేస్లాపూర్ సొంజెర్.. దీర నన్ గిరే వాంతోన్.. అంటూ తరలివస్తున్న భక్తజనంతో కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. సోమవారం ఉదయం మెస్రం వంశీయులు పెర్సా పేన్, బాన్ పేన్కు పూజలు నిర్వహించారు. ముందుగా గోవడ్ నుంచి సంప్రదాయ వాయిద్యాల నడుమ బాన్ ఆలయానికి చేరుకున్నారు. మెస్రం కొత్త కోడళ్లు కోనేరు నుంచి నీళ్లు తీసుకురాగా, మెస్రం ఆడపడుచులు బాన్ ఆలయం ముందున్న పాత పుట్టలను తొలగించి కొత్త పుట్టలు తయారు చేశారు. అనంతరం నాగోబా ఆలయం వెనుక ఉన్న మెస్రం పెద్దదేవుడు పెర్సా పేన్ను భక్తిశ్రద్ధలతో పూజించారు.
నాగోబా దర్బార్‌కు మంత్రులు
నాగోబా జాతరలో భాగంగా మంగళవారం నిర్వహించే దర్బార్‌కు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రానున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొననున్నారు. నాగోబా జాతర, దర్బార్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు మంగళవారం కలెక్టర్ పట్నాయక్ సెలవు ప్రకటించారు.