Team India: కొత్త బ్యాటింగ్ కోచ్ వేటలో బీసీసీఐ.. రేస్‌లో ఇంగ్లాండ్ మాజీ స్టార్ క్రికెటర్

గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. బౌలింగ్ లో రాణిస్తున్నా బ్యాటింగ్ లో చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను 0-2 తేడాతో.. స్వదేశంలో  న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో వైట్ వాష్ అయ్యారు. ఇటీవలే జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పేలవ బ్యాటింగ్ తో తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో బీసీసీఐ భారత్ కు కొత్త బ్యాటింగ్ కోచ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

ALSO READ | Team India: నా తండ్రికి గుండెపోటు.. జట్టు నుంచి తప్పించారని చెప్పలేకపోయా: భారత ఓపెనర్

రిపోర్ట్స్ ప్రకారం త్వరలో భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ రానున్నాడు. అదే జరిగితే ఈ రేస్ లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్  అందరి కంటే ముందున్నాడు. భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా తనకు ఆసక్తి ఉందని వెల్లడించాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కు సిద్ధంగా ఉన్నానని..తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించాడు.ఒకవేళ కెవిన్ పీటర్సన్ భారత జట్టు కోచ్ గా వస్తే అనుకూలంగా మారనుంది. పీటర్సన్ ఇంగ్లండ్  క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. 104 టెస్టుల్లో 47.28 సగటుతో 8181 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలు ఉన్నాయి. 

ప్రస్తుతం భారత కోచింగ్ సిబ్బందిలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మోర్నే మోర్కెల్ (బౌలింగ్ కోచ్), అభిషేక్ నాయర్ (సహాయక కోచ్), ర్యాన్ టెన్ డోస్చాట్ (అసిస్టెంట్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉన్నారు. టీమిండియా జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు పీటర్సన్ ను బ్యాటింగ్ కోచ్ గా సెలక్ట్ చేసే అవకాశం ఉంది.