Kevin Pietersen: పాకిస్థాన్‌లో క్రికెట్‌కు ఏమైంది.. బంగ్లాపై ఓటమితో పీటర్సన్ షాక్

సొంతగడ్డపై మ్యాచ్.. ప్రత్యర్థిగా పసికూన జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్.. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు ఇదీ పాకిస్థాన్ పరిస్థితి. అయితే చివరి మూడు రోజుల్లో పాక్ జట్టు పూర్తిగా గాడి తప్పింది. మొదట బ్యాటింగ్ లో విఫలమై బంగ్లాకు ఆధిక్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో చేతులెత్తేశారు. దీంతో బంగ్లాదేశ్ పై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చూశారు. ఈ ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ స్టార్ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 

పాకిస్తాన్‌లో క్రికెట్‌కు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గతంలో తాను పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను పీఎస్‌ఎల్ ఆడుతున్నప్పుడు ఆ లీగ్ కు మంచి ఆదరణ ఉండేదని.. చాలా మంది ప్రతిభ గల ఆటగాళ్లను నేను చూశానని కెవిన్ అన్నాడు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఆ దేశంలో ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. ఈ ఓటమిపై ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను  పాక్‌‌‌‌‌‌‌‌ 448/6  స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. బంగ్లా 565 రన్స్‌‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో పాక్ 146 పరుగులకు ఆలౌట్ కాగా.. 30 పరుగుల స్వల్ప టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీ చేసిన  ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ రావల్పిండి వేదికపైనే ఆగస్టు 30 నుంచి జరుగుతుంది.