త్వరలోనే వారందరికి ఇందిరమ్మ ఇండ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎమ్మెల్యే వివేక్

త్వరలోనే వారందరికి ఇందిరమ్మ ఇండ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎమ్మెల్యే వివేక్

రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని.. అర్హులైన పేదలకు త్వరలోనే ఇండ్లను కేటాయిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ (సెప్టెంబర్ 27) క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అర్హులైన 10,729 మంది మహిళలకు గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలను ఎమ్మెల్యే వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తారో లేదో అని అపోహలు ఉండేవని.. కానీ అనుమాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

 మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహిళల మేలు కోసమే కాంగ్రెస్ సర్కార్ పని చేస్తుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాల రుణమాఫీని 5 దఫాలుగా చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.2 లక్షలను ఒకేసారి మాఫీ చేసిందని గుర్తు చేశారు. గృహా జ్యోతి స్కీమ్‎కు సంబంధించి గ్యాస్ సబ్సిడీలో లింక్ చేయని వారికి రాయితీ రావడంలో ఇబ్బందులు ఉన్నాయని.. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని ఇటీవల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కలిసి సమస్యను వివరించారని.. త్వరలోనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతోందని పేర్కొన్నారు. 

ALSO READ | తెలంగాణలో బీఆర్​ఎస్ 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది

తాను ఎంపీగా ఉన్నపుడు క్యాతన్ పల్లి రైల్వే గేట్ వద్ద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఆర్ఓబీని మంజూరు చేస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్ఓబి పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్‎ను సత్వరమే ఆర్ఓబీ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక, తాను చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.6.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.