ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్

ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్
  • స్కీమ్​కు వేగంగా నిధులు సేకరిస్తున్న ప్రభుత్వం
  • హడ్కో నుంచి ఇప్పటికే రూ.850 కోట్ల లోన్ సాంక్షన్
  • ఈ నెలలో రాజీవ్ స్వగృహ వేలం
  • రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పక్కా ప్లాన్​తో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా నిధులు  సమీకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమయింది. ఇప్పటికే వీకర్  సెక్షన్  హౌసింగ్  పోగ్రాంలో భాగంగా హడ్కో రూ.850 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసింది. ఇపుడు రాజీవ్  స్వగృహ ల్యాండ్స్, టవర్లు, అపార్ట్ మెంట్లకు ప్రభుత్వం ఈనెలలో వేలంపాట నిర్వహించనుంది. వీటి ద్వారా రూ.700 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల హౌసింగ్  బోర్డు భూములను లీజుకు తీసుకొని అమౌంట్  కట్టని వారి అగ్రిమెంట్ల ను రద్దుచేశారు.

రెండు కంపెనీల నుంచి సుమారు రూ.350 కోట్లు వసూలు కావాల్సి ఉంది. . దీంతోపాటు గత ఏడాది పూర్తయిన డబుల్  బెడ్  రూమ్  ఇండ్లను లబ్ధిదారులకు కాంగ్రెస్  ప్రభుత్వం అందజేసింది. వీటి వివరాలను కేంద్రానికి పంపగా దశలవారీగా పీఎం ఆవాస్  యోజన నుంచి ఫండ్స్  రిలీజ్ చేస్తోందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను హౌసింగ్, పంచాయతీ అధికారులు.. గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిశీలిస్తున్నారు. ఈ పక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తికానున్నట్లు తెలుస్తోంది. 

అనంతరం లబ్ధిదారుల లిస్ట్ ను ఖరారుచేసి గ్రామసభలో ఆమోదించి, జిల్లా లేదా ఇన్ చార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్  ఆ లిస్టును ఫైనల్  చేస్తారు.  తొలి దశలో సొంత జాగా ఉన్న వ్యసాయ భూమి లేని కూలీలు, వితంతువులు, వికలాంగులు, పేద వాళ్లకు  ప్రాధాన్యం ఇవ్వాలని  అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

ఈ నెలలోనే రాజీవ్ స్వగృహ వేలం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజీవ్  స్వగృహ అపార్ట్ మెంట్లు, జాగాలను వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.  ఈనెలాఖరుకు వేలం వేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. త్వరలో వేలానికి సంబంధించి నోటిఫికేషన్  ఇస్తామని అధికారులు చెబుతున్నారు.  ఈ వేలంలో  రాష్ర్టంలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఖాళీ జాగాలు,  పూర్తయిన టవర్లను వేలంలో అమ్మనున్నారు. 

ముందే  కేంద్రానికి లబ్ధిదారుల లిస్ట్

పీఎం ఆవాస్  యోజన స్కీమ్  కింద ఫండ్స్  రిలీజ్ చేయాలంటే రాష్ర్ట ప్రభుత్వం.. లబ్దిదారుల లిస్టును ముందుగానే కేంద్రానికి పంపాలి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ స్కీమ్ కు లబ్ధిదారులను ఎంపిక చేసి  పీఎం ఆవాస్ యాప్ లో అప్ లోడ్  చేయనున్నారు. బీఆర్ఎస్​ హయాంలో డబుల్  బెడ్ రూమ్   ఇండ్ల స్కీమ్ కు ఇళ్ల నిర్మాణం పూర్తయిన తరువాత లబ్ధిదారులకు పట్టాలు అందించారు. దీంతో తమ రూల్స్ కు అనుకూలంగా లేకపోవడంతో రూ.1100 కోట్ల విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది.

ఫలితంగా నిధుల సమీకరణకు కష్టాలు ఎదురుకావడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇండ్ల నిర్మాణం నత్త నడకన కొనసాగింది. 8 ఏండ్లలో  2.70 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పిన బీఆర్ఎస్  ప్రభుత్వం లక్ష ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు. కాగా.. గత ఏడాది కొలువుదీరిన కాంగ్రెస్  ప్రభుత్వం.. ఇండ్ల నిర్మాణానికి నిధులు రిలీజ్  చేస్తూ పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది.