అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు

అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు
  • రేపటి నుంచి వానాకాలం సెషన్​​ ప్రారంభం
  • ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం
  • జాబ్ క్యాలెండర్.. రైతు భరోసా విధి విధానాల ప్రకటన
  • విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ​ఎలక్షన్స్​లో
  • రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు
  • తెలంగాణ తల్లి విగ్రహం..రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర సర్కారు పక్కా ప్లాన్​తో రెడీ అయింది. పాలనలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదంతోపాటు ముఖ్యమైన అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. 10 నుంచి 12 రోజుల పాటు జరపనున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్​కు ఆమోదం తెలపడంతోపాటు స్కిల్​యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు.

 ఈ సమావేశాల్లోనే జాబ్‌‌‌‌‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ ను ప్రకటించనున్నారు.  రైతు భరోసా విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారినుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తదితర అంశాలపై చర్చించి, తీర్మానం చేయనున్నారు. విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ధరణిలో జరిగిన అక్రమ వ్యవహారాలపై  ప్రభుత్వం వైట్​పేపర్ పెట్టనున్నది. అన్నింటిపై సుదీర్ఘంగా చర్చిస్తూనే.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నది.

స్కిల్​యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి డ్రాఫ్ట్​ బిల్లును ఇప్పటికే  రెడీ చేశారు. బడ్జెట్​కు ఆమోదం తెలిపిన వెంటనే స్కిల్​యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకోనున్నారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్​లో) స్కిల్​యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  స్వయం ప్రతిపత్తి ఉండేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.  

మూడు, నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతోపాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలైన ఫార్మా, కన్​స్ట్రక్షన్​, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ వంటివి ఉన్నాయి. తొలి ఏడాది 2 వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేలా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొదటి బిల్లు స్కిల్​ యూనివర్సిటీదే కావడం విశేషం.

జాబ్ ​క్యాలెండర్ ​సిద్ధం

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్​ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జాబ్​ క్యాలెండర్​ ఎలా ఉంటుంది ? ప్రతి ఏటా నియామక ప్రక్రియ ఎలా చేపడతాం? అనేది అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించనున్నది. ఇప్పటికే ఆర్థిక శాఖ, రిక్రూట్​మెంట్​ బోర్డులతో సంప్రదించి జాబ్​ క్యాలెండర్​ను రూపొందించింది. ప్రతి ఏటా మార్చి చివరి నాటికి ఉద్యోగ ఖాళీలను సేకరించనున్నారు. 

ఆ తర్వాత సెంట్రల్​ఎగ్జామ్స్, రాష్ట్రంలో వివిధ రిక్రూట్​మెంట్​బోర్డులు ఏ టైంలో ఎగ్జామ్స్​ నిర్వహిస్తారనేది స్పష్టతనిస్తారు. యూపీఎస్సీ తరహాలో జాబ్​ క్యాలెండర్ తయారు చేశారు. జూన్​ 2వ తేదీకల్లా నోటిఫికేషన్లు ఇచ్చి.. డిసెంబర్​9 కల్లా పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి జాబ్​ క్యాలెండర్​ను ప్రకటిస్తుండడంతో నిరుద్యోగుల్లో ఆసక్తి నెలకొన్నది. 

రైతు భరోసా విధి విధానాలపై ప్రకటన

రైతు భరోసా విధి విధానాలపైనా అసెంబ్లీలో చర్చించి, ప్రకటన చేయనున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయంపైనా స్పష్టత ఇవ్వనున్నారు.  ఇప్పటికే ఈ స్కీమ్​పై మంత్రులు జిల్లాల్లో పర్యటించి, రైతుల నుంచి ఫీడ్​ బ్యాక్​తీసుకున్నారు. వాటన్నింటిపైనా చర్చించి.. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి ? ఎంత విస్తీర్ణంలో పంటలు సాగైతే అంత వరకే ఇవ్వాలా? లేక వ్యవసాయ భూములన్నింటికీ కొంత సీలింగ్​పెట్టి ఇవ్వాలా? అనేదానిపై నిర్ణయం వెల్లడించనున్నారు.

 గత ప్రభుత్వం రైతుబంధు కింద ఏకంగా రాళ్లు, గుట్టలు, హైవేల వంటి సాగుకు యోగ్యం కాని భూములకు రూ.26 వేల కోట్ల మేర దుబారాగా చెల్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు పంట పెట్టుబడి సాయం అవసరం లేదనే వాదన ఉండగా.. దీనిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. 

రికవరీ.. విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అర్హత లేకున్నా వివిధ సంక్షేమ పథకాల కింద కొందరు లబ్ధి పొందారు. దీంతో ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయమై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా చర్చించి, విధివిధానాలు రూపొందించనున్నారు. విద్య, వ్యవసాయంపై ఫోకస్​ పెట్టిన ప్రభుత్వం రెండింటికీ వేర్వురుగా కమిషన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నది. వీటిపైనా కూడా అసెంబ్లీలో చర్చించి, తీర్మానం చేయనున్నట్టు తెలిసింది.

బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ తల్లి విగ్రహం.. రాష్ట్ర చిహ్నం

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపైనా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. అదే సమయంలో స్పెషల్​ ఆఫీసర్లు ఉంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో ఇప్పటికిప్పుడు కుల గణన సాధ్యం కాకపోతే.. ఏ రకంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. 

అలాగే, తెలంగాణ తల్లి విగ్రహంపైనా చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై గతంలో విపక్షాలు విమర్శలు చేశాయి. రాష్ట్ర చిహ్నం కూడా ఉద్యమ స్ఫూర్తిని కలిగించేలా, తెలంగాణ చరిత్ర కనిపించేలా ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ రెండింటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.