ఇంగ్లండ్‌‌ టూర్‌‌ ముంగిట టీమిండియాలో కీలక మార్పులు..

ఇంగ్లండ్‌‌ టూర్‌‌ ముంగిట  టీమిండియాలో కీలక మార్పులు..

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌ టూర్‌‌ ముంగిట టీమిండియా కోచింగ్ స్టాఫ్‌‌లో కీలక మార్పులు రానున్నాయి. అసిస్టెంట్‌‌ కోచ్‌‌ అభిషేక్‌‌ నాయర్‌‌పై బీసీసీఐ వేటు వేసింది. అతనితో పాటు ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ హైదరాబాదీ  టి. దిలీప్‌‌, స్ట్రెంత్‌‌ అండ్‌‌ కండిషనింగ్‌‌ కోచ్‌‌ సోహమ్‌‌ దేశాయ్‌‌ను కూడా తొలిగించినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్‌‌, ఆస్ట్రేలియాతో టెస్ట్‌‌ సిరీస్‌‌ వైఫల్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా స్పష్టమైన సమాచారాన్ని బీసీసీఐ వెల్లడించలేదు. 

కోచ్‌‌ల తొలగింపు వ్యవహారంపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని బోర్డు సెక్రటరీ దేవజిత్‌‌ సైకియా చెప్పారు. ‘కివీస్‌‌, ఆసీస్‌‌తో సిరీస్‌‌ పరాజయాలు గందరగోళానికి దారితీశాయి. ఈ సందర్భంగా సపోర్ట్‌‌ స్టాఫ్‌‌లోని ఓ వ్యక్తికి, సీనియర్‌‌ ప్లేయర్‌‌కు మధ్య గొడవ జరిగింది. ఇందులో నాయర్‌‌ బలి పశువుగా మారాడని తెలుస్తోంది’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీసీసీఐ కొత్త స్టాండర్డ్‌‌ ఆపరేటింగ్‌‌ ప్రొసిజర్‌‌ (ఎస్‌‌వోపీ) ప్రకారం సపోర్ట్ స్టాఫ్ పదవీకాలన్ని మూడేండ్లకు పరిమితం చేశారు. దీంతో దిలీప్‌‌, దేశాయ్‌‌పై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. దేశాయ్‌‌ ప్లేస్‌‌లో అడ్రియన్‌‌ లి రౌక్స్‌‌ (సౌతాఫ్రికా)ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

సితాన్షు రాకతో..

చాంపియన్స్‌‌ ట్రోఫీలో అదనంగా బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా సితాన్షు కోటక్‌‌ను తీసుకోవడంతో నాయర్‌‌పై వేటు పడుతుందనే సంకేతాలు వచ్చాయి. అప్పట్లో జరిగిన ఓ సమావేశంలో బోర్డులోని ఓ శక్తివంతమైన సభ్యుడు నాయర్‌‌ గురించి ఆందోళన వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. అతను డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తున్నాయన్న సందేహాలను లేవదీసినట్లు సమాచారం. దీంతో వెంటనే చర్యలు తీసుకోకపోయినా.. చాంపియన్స్‌‌ ట్రోఫీ నేపథ్యంలో సితాన్షు కోటక్‌‌ను కోచింగ్‌‌ బృందంలోకి ప్రవేశపెట్టింది.  గంభీర్‌‌, రోహిత్‌‌ మధ్య వారధిగా సితాన్షు బాగా పని చేయడంతో నాయర్‌‌ను తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.