మమ్మల్నే తట్టుకోవట్లే.. KCR​ దెబ్బను రేవంత్ తట్టుకుంటడా..?

మమ్మల్నే తట్టుకోవట్లే.. KCR​ దెబ్బను రేవంత్ తట్టుకుంటడా..?
  • కేసీఆర్​ కచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తరు
  • ఇన్నాళ్లూ ప్రభుత్వానికి టైమిచ్చారు.. అన్నీ నిశితంగా పరిశీలించారు
  • ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గరవుతం.. పరిణతి వస్తది
  • కేసీఆర్ ​ఉన్నంత వరకూ ఆయనే మా లీడర్ 
  • పార్టీ లైన్​ మేరకే పనిచేస్తం.. పార్టీ ఏం చెబితే అది చేస్తానని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: కేసీఆర్​ కచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారని, ఈ విషయం ఈమధ్యనే కేసీఆర్​ స్పష్టంగా చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వానికి ఆయన ఏడాది సమయం ఇచ్చారని, అన్నీ నిశితంగా గమనించారని అన్నారు. అయినా, అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో కేటీఆర్, హరీశ్​ దెబ్బలకే రేవంత్​ తట్టుకోలేకపోతున్నారని, కేసీఆర్​ దెబ్బలను తట్టుకోగలరా? అని సవాల్​ చేశారు. రుణమాఫీ విషయంలో తాను వేసిన ట్రాప్​లో రేవంత్​ పడ్డారని, అందుకే పంద్రాగస్టు నాడు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని అన్నారు. శనివారం వీ6 వెలుగు ఇంటర్వ్యూలో హరీశ్​రావు.. కేసీఆర్ వ్యూహాలు, పార్టీ కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడారు.  

పదేండ్లు అధికారంలో ఉన్నరు.. ఏడాది నుంచి ప్రతిపక్షంలో ఉన్నరు. ప్రతిపక్షం రోల్​ ఎలా ఉంది?

ప్రభుత్వమంటే బాధ్యతలుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలతో కలిసి ఉంటాం. ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసేందుకు వీలుంటుంది. 

ప్రతిపక్షంలో సక్సెస్​ అయ్యారా?

అధికారంలోకి రాగానే తొలి సంతకం రైతు రుణమాఫీపైనే చేస్తామని రేవంత్​ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వంపై ప్రతిపక్షంగా నేను ఒత్తిడి చేశా. నా ట్రాప్​లో రేవంత్​ పడ్డారు. అందుకే.. కనీసం ఆ రూ.16 వేల కోట్లైనా రుణమాఫీ చేశారు. అది మా కృషే. 

కాంగ్రెస్ 6 నెలల్లోనే  22 వేల కోట్ల మేర రుణమాఫీ చేసింది కదా?

రైతు బంధు కింద ఇవ్వాల్సిన రూ.7500 కోట్లు బంద్​ పెట్టిన్రు. ఫీజు రీయింబర్స్​మెంట్​ రూ.3,500 కోట్లు ఎగ్గొట్టిన్రు. పింఛన్​ రూ.2 వేల కోట్లు ఇయ్యలే. wఆ పైసలు తీసుకొచ్చి రుణమాఫీ చేశారు. అది కూడా సగమే చేశారు.  

అసెంబ్లీకి కేసీఆర్​రావాలంటూ సీఎం అడుగుతున్నా ఎందుకు రాలేదు?
కాంగ్రెస్​ పార్టీ డ్రామా ఆడుతున్నది. నేను మాట్లాడినా.. కేటీఆర్​ మాట్లాడినా.. మా ఎమ్మెల్యేలు మాట్లాడినా అది కేసీఆర్​ లేదా పార్టీ డైరెక్షన్‎లోనే కదా.

అసెంబ్లీలో అపొజిషన్​ లీడర్​లేకుండా ఎలా..?
మేం కాదా అపొజిషన్​లీడర్. మా పార్టీ ఎమ్మెల్యేలం అసెంబ్లీలో హ్యాండిల్​ చేస్తలేమా?

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే స్ట్రాటజీనా?

వైఎస్​జగన్​అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి పోయారా? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జగన్​అసెంబ్లీకి వెళ్తున్నారా? ఎవరి స్ట్రాటజీ వాళ్లకు ఉంటుంది కదా? ఏ పార్టీకి ఉండాల్సిన స్ట్రాటజీ వారికి ఉంటుంది. ఎప్పుడు రావాలో.. ఎలా రావాలో.. దిమ్మతిరిగిపోయేటట్టు ఎలా కొట్టాలో మాకు తెలుసు.  

మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి నివాళి అర్పించేందుకు అసెంబ్లీ పెట్టారు. కేసీఆర్​ వచ్చి మాట్లాడాల్సి ఉండే కదా?

అది కేసీఆర్​ కాదు.. అసెంబ్లీలో పార్టీగా బీఆర్ఎస్​రిప్రజెంట్​ చేస్తుంది. కులగణన విషయంలో రేవంత్​ రెడ్డి సెల్ఫ్​గోల్​ చేసుకున్నారు. వారి ఎమ్మెల్సీనే దానిని చించి పారేశారు. ఆర్​. కృష్ణయ్య లాంటి వ్యక్తులు కులగణన పేపర్లను తగులబెడుతున్నరు. కామారెడ్డి డిక్లరేషన్​ అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. కేసీఆర్​రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి, అసెంబ్లీలోకి వస్తరు. కచ్చితంగా పోరాడుతరు. 

సమ్మె చేయండని ఆర్టీసీ కార్మికులను ఉసిగొల్పడం ఎంత వరకు కరెక్ట్..?

మేం ఉసిగొల్పామన్నది తప్పు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అసెంబ్లీలో చర్చించి బిల్లు పాస్​ చేశాం. జీవోలు వచ్చాయి. కేబినెట్​ తీర్మానం కూడా పాసైంది. అలాంటప్పుడు దానిని ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని కార్మికులు అడుగుతున్నారు. అందులో తప్పేముంది.
   
కాంగ్రెస్​విజయాలను హరీశ్​ తట్టుకోలేకపోతున్నారా?
రేపు స్థానిక ఎన్నికల్లో తెలుస్తుంది కదా?  వారు ప్రజల్లోకి వెళ్లేందుకే భయపడుతున్నారు. 

ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు కదా?

కుల గణన చెత్త కాగితంతో సమానం. మక్కలు, కందులు, పత్తి, జొన్నల వంటి వాటికి బోనస్​ఎందుకు ఇవ్వలేదు. అన్నింటికి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు కదా? ఎందుకు చేయలేదు? 

మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. 

తెలంగాణ గీతాన్ని అధికారికం చేయలేదు. ప్రభుత్వం చేస్తే పెడబొబ్బలు ఎందుకు పెడుతున్నరు?
కాకతీయ తోరణం, చార్మినార్​ను తీసేయడం తెలంగాణ అస్థిత్వమా? ఇవన్నీ చిల్లరమల్లర రాజకీయాలు. టీఎస్​ను తీసేసి టీజీ పెట్టిండు. దాని వల్ల ఏం లాభం. పోలీస్​ లోగో మార్చిండు. ప్రజల జీవితాలను మార్చేస్తానన్నారు. మీరు తెచ్చిన మార్పు ప్రజల చావులు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, రైతులు చనిపోతున్నారు. చివరకు బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయి. భరతమాత విగ్రహాన్ని అధికారికంగా పెట్టారా? ఇదంతా రేవంత్​ చేస్తున్న చిల్లర రాజకీయం. మేం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాం. సంగారెడ్డి కలెక్టరేట్​లో నేను మంత్రి హోదాలో అధికారికంగా విగ్రహాన్ని  ప్రారంభించా. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది తెలంగాణ తల్లి విగ్రహాలున్నాయి. 

మరి, ప్రజలు మార్పు ఎందుకు కోరుకున్నరు?

రైతు భరోసా రూ.15 వేలు అన్నరు. పింఛన్​ డబుల్​అని చెప్పిన్రు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం అన్నారు. ప్రతి రోజూ సీఎం కలుస్తారని చెప్పారు. ఇవన్నీ చూసి ప్రజలు మార్పు కావాలనుకున్నారు. 

ఇప్పుడు మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారన్న చర్చ నడుస్తున్నది కదా..?

వసూళ్లలో స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఒకరు 10 పర్సెంట్​.. ఒకరు 30 పర్సెంట్.. ఒకరు స్క్వేర్​ఫీట్‎కు వంద రూపాయలు. ఇదే స్వేచ్ఛ. 
కేటీఆర్, హరీశ్​రావు ట్వీట్ల మీద పనిచేశారు. ఇప్పుడు వారి పేషీల్లో పనిచేసుకుంటున్నారని అంటున్నారు. అందులో తప్పేముంది?
జనం నవ్వుతున్నరు. అవినీతి పెల్లుబికింది. సీఎం రేవంత్​ రెడ్డి ఉండే ఆరో ఫ్లోర్​కు ఎవరినీ పంపించే పరిస్థితి లేదిప్పుడు. ఒక్కటే లిఫ్ట్​ పెట్టి బ్లాక్​ చేస్తున్నారు. కనీసం రిపోర్టర్లనూ పంపించే పరిస్థితి లేదు. ఫైనాన్స్​మినిస్టర్​ దగ్గరికి పోవాలంటే చెకింగ్​లు, పోలీసులు మామూలుగా లేదు. ఫోన్లు కూడా డిపాజిట్​ చేయాల్నట. మా హయాంలో ఇలా లేదు. ఇప్పుడు మంత్రులు ఎంత సంపాదించినా.. అందులో కప్పం ఢిల్లీకి కట్టాలి. 

పార్టీలో కేటీఆర్​, హరీశ్.. మధ్యలో కవిత ఎందుకు? 

మా నాయకుడు అక్షరాలా కేసీఆరే. ప్రతి నిర్ణయం, ప్రతి మాటా కేసీఆర్​ చెప్పిందే. కేసీఆర్​ డైరెక్షన్​ ఉంటుంది. ప్రతి రోజూ రివ్యూ చేస్తారు. 

హరీశ్ ఈ మధ్య కామ్​అయ్యారని వినిపిస్తున్నది. కామ్​అయ్యారా.. కామ్​ చేశారా? 

ఇవన్నీ కామన్. కామ్​చేసుడు లేదు.. కామాల్లేవు. పోరాడుతూనే ఉంటం. కేటీఆర్, హరీశ్​మధ్య పోటీ ఉందని 24 ఏండ్లుగా చెప్తూనే ఉన్నారు. వింటనే ఉన్నం. పాత చింతకాయ పచ్చడి ముచ్చట. అందరం కలిసే కొట్లాడ్తం. కేసీఆర్​చెప్పినట్టు చేస్తం. 

కేటీఆర్​కోసం పనిచేయమంటే చేస్తారా? మీ క్యాడర్​కు ఏం చెప్తరు?  

పార్టీ ఏం చెబితే అది చేస్తా. పార్టీ లైన్​ను ఫాలో కావాలని అందరికీ చెప్తా. పార్టీనే సుప్రీం. పార్టీ ఏం చెబుతుందో కలేమైనా కంటామా? పార్టీ నిర్ణయమే ఫైనల్​.

అధికారంలో ఉన్నప్పుడూ ఫాంహౌస్​లోనే.. ప్రతిపక్షంలోనూ ఫాంహౌస్‎కే. ఇదెక్కడి పరిస్థితి.. పార్టీ అధ్యక్షుడు కదా?

ఇది కాంగ్రెస్​ భాష. అది వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయం చేసుకోవడం తప్పా. పార్టీ అధ్యక్షుడైతే అధ్యక్ష బాధ్యతలు చేస్తరు.. వ్యవసాయం చేసుకుంటారు. రైతుగా వ్యవసాయం చేస్తాడు. పార్టీ అధ్యక్షుడిగా రాజకీయమూ చేస్తాడు. మొన్ననే చెప్పిండు కదా.. బయల్దేరుతున్నా బిడ్డా..  నీ సంగతి చూస్తా అన్నారు కదా? 

కేసీఆర్​ అసెంబ్లీకి ఎందుకు వస్తలే?

కేసీఆర్​మొన్ననే దీనిపై చాలా స్పష్టంగా చెప్పారు కదా. ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలించానని తెలిపారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? లేదా? అనేది చూశాను అన్నారు. ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చానని చెప్పారు.  కానీ, ప్రభుత్వం ప్రజల నమ్మకాలను వమ్ము చేసి.. మోసం చేసింది కాబట్టి.. ఇక ప్రజల పక్షాన పోరాడేందుకు బయల్దేరుతానని కేసీఆర్​ చెప్పారు. ఈ నెలాఖరున భారీ బహిరంగ సభకు ప్లాన్​ చేసుకున్నాం. కచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోరాడుతాం. అది శాసనసభ కావచ్చు.. ప్రజా క్షేత్రం కావొచ్చు. మేం పోరాడుతాం.