హైదరాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి సీఐ కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆ రోజు జరిగిన పూర్తి వీడియోను హైదరాబాద్ పోలీసులు ఆదివారం (డిసెంబర్ 22) రిలీజ్ చేశారు. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి సీఐ మాట్లాడుతూ.. ‘తొక్కిసలాట జరిగిన సమయంలో అక్కడే ఉన్నా. తొక్కిసలాటలో గాయపడిన రేవతిని బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమించాం. మా చేతిలోనే రేవతి ప్రాణాలు కోల్పోయింది. తొక్కి సలాట ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. 15 రోజులుగా మన:శాంతి లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ రాక కోసం సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ కోసం వచ్చింది.. కానీ రెండు థియేటర్లకు ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ గేటు ఉండటంతో అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయిన అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్‌కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని చెప్పారు. తొక్కిసలాటలో మా ప్రాణాలు కూడా పోతాయనిపించిందని అన్నారు. థియేటర్ దగ్గర పరిస్థితి అదుపు తప్పిందని.. అల్లు అర్జున్ వెళ్లిపోవాలని కోరగా ఆయన నిరాకరించాడు. పై అధికారులు వచ్చి చెప్పిన తర్వాత ఆయన థియేటర్ నుండి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.