ఆనాడే చెప్పా: తండ్రి, కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు ఉద్యోగాలు

ఆనాడే చెప్పా: తండ్రి, కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు ఉద్యోగాలు

హైదరాబాద్: నిరుద్యోగులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్  రావు, కవిత కొలువులు ఊడగొట్టాలని ఆనాడే చెప్పా. చెప్పినట్లుగానే కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారు.. ఇప్పుడు మీకు కొలువులు వస్తున్నాయని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రెండు సార్లు కొరివి దెయ్యం పాలించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.. కానీ పదేండ్లలో ఏనాడైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేశావా అని కేసీఆర్‎ను ప్రశ్నించారు. 

తెలంగాణ డీఎస్సీలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఇవాళ (2024, అక్టోబర్ 9)  హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు.. కానీ పదేండ్లలో బీఆర్ఎస్ ఏనాడు నిరుద్యోగులను పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ మేం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.

ALSO READ | గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు TGPSC బిగ్ అలర్ట్

తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లతో కీలక పాత్ర అని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మేం రాగానే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే అడ్డుకోవడానికి కొన్ని గుంటనక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయని.. కానీ ఆ కుట్రలన్నీంటిని ఢీకొట్టి నియమాకాలు పూర్తి చేశామని తెలిపారు. ఇవాళ మీ సంతోషాన్ని చూసి కొందరు కళ్లలో కారం కొట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.