కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్‌ కీలక ప్రకటన

కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్‌ కీలక ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కుల గణన సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగింపు వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

‘‘కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం. కులగణనతో ఎవరికీ ఇబ్బంది ఉండదు. కులగణనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం. ఇది ఎక్స్‌రే కాదు.. మెగా హెల్త్‌ క్యాంప్‌లాంటిది. సమాజంలో మార్పులకు అనుగుణంగానే ఈ సర్వే’’ చేపట్టామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కావాలంటే కులగణన జరగాలని అన్నారు.

 విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలన్నారు. కులగణనపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనని.. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి కులగణనపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరు అడ్డు వచ్చినా కులగణన ఆగదని.. 2025లో జరిగే జనగణనలో కూడా కులగణన చేసేలా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హాట్ కామెంట్స్ చేశారు. కులగణనతో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని.. ఎవరి ఆస్తులు తీసుకోమని క్లారిటీ ఇచ్చారు.