హైదరాబాద్: మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండగ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, రైతుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో 9 ఏళ్లు కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నాం.. ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజలకు ఏ మాత్రం ప్రేమ తగ్గలేదని విషయం రైతు పండగ వేడుకతో స్పష్టమైందన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. దీనికి మేం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల రూ.6500 కోట్ల వడ్డీ కడుతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఈ విషయాలను ఎప్పుడు బయటపెట్టలేదని.. మేం అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. నెలకు వడ్డీనే రూ.6500 కోట్లు కడుతున్నామంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక స్థితి ఆగమ్యగోచరంగా ఉన్నా అధైర్య పడకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు మేలు చేస్తున్నాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధు ఇచ్చాం.. విడతలవారీగా రైతు రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. మూడు విడతల్లో రూ.17,869 కోట్లతో 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. నెహ్రూ నుండి వైఎస్ దాకా రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ పార్టీ ఎజెండా.. సాగునీటి ప్రాజెక్టులు, హరిత విప్లవం, ఉచిత విద్యుత్ వంటివన్నీ రైతులు, రైతు కూలీలను దృష్టిలో పెట్టుకుని చేసిన సమూల మార్పులని అన్నారు. ఈ మార్పులతో రైతుల జీవితాల్లో పూర్తిగా వెలుగులు రాలేదని.. ఇందుకోసం రైతులను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మరోసారి చేపట్టిందని తెలిపారు.