హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ (సెప్టెంబర్ 11) శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్సైల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూల్చేస్తామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతామని.. ఈ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు.
చెరువుల ఆక్రమణలతోనే హైదరాబాద్ సిటీని వరదలు ముంచుతెత్తుతున్నాయని.. సిటీలోని చెరువులు అన్నీ చాలా వరకు కబ్జాకు గురయ్యాయని.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా ఫాంహౌస్ కట్టుకోవచ్చని.. అభ్యంతరం లేదన్నారు.. అయితే ఆ ఫాంహౌస్ కట్టుకున్న వాళ్లు.. వాళ్ల డ్రైనేజీని మంచినీటి జలాశయాల్లోకి వదులుతున్నారని.. దీని వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయన్నారు. చెరువులను చెరబట్టిన వారి కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం అని.. చెరువులను కబ్జా చేసినోళ్లను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ ; నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్
చెరువులను ఆక్రమించాలన్నా.. కబ్జా చేయాలన్న ఆలోచన వస్తేనే వాళ్ల వెన్నులో వణుకు పుట్టాలని.. మోకాల్లో చలి జ్వరం రావాలన్నారు. ఆ దిశగా ప్రక్షాళన జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసి ప్రక్షాళన చేసి.. పేదలు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉన్న వారిని ప్రభుత్వం ఆడుకుంటుందని భరోసా ఇచ్చారాయన. 12 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పించి.. వాళ్లు ఆత్మ గౌరవంతో జీవించేలా చూస్తామని హామీ ఇచ్చారు.