హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 12) సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో జరిగిన అక్రమాల నుండి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని.. ఇందుకోసమే అతడు హుటాహుటిన ఢిల్లీ టూర్‌కు వచ్చాడని హాట్ కామెంట్స్ చేశారు.
ఈ కార్ రేసింగ్‌లో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశామని.. గవర్నర్ నుండి పర్మిషన్ రాగానే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, అమృత్ స్కామ్‌లో అక్రమాలు జరిగాయంటూ కేటీఆర్ చేస్తోన్న ఆరోపణలపైన సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్, కేటీఆర్ చేస్తోన్న ఆరోపణలు అవాస్తమని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. టెండర్ల ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్ చేయండని సూచించారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా సృజన్ రెడ్డి మా బంధువు కాదని.. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి అల్లుడని క్లారిటీ ఇచ్చారు. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు టెండర్లు దక్కాయని గుర్తు చేశారు.
రెడ్డి అనే పేరున్న వారంతా నా బంధువులు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఆ పార్టీతో ఎలా కలుస్తున్నారు..? మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటేయొద్దంటే బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు అత్యంత అవినీతిపరులని కేటీఆర్ గతంలో విమర్శించారు.. ఇప్పుడు అదే బీజేపీ నేతలకు మాపై ఎలా ఫిర్యాదు చేస్తున్నారని నిలదీశారు.