హైదరాబాద్: తెలంగాణ స్టే్ట్ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 24) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విదేశాల నుండి ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు రావులకు రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ ప్రస్తుతం సీబీఐ వద్ద ప్రాసెసింగ్‌లో ఉందన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్ అని, ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్న డీజీపీ.. నిందితులకు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేందుకు ఇంకా కొంత సమయం పడుతోందని తెలిపారు.
ALSO READ | కవిత ఎక్కడ.. జనంలోకి రాని కేసీఆర్ తనయ..!
ఇక, తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉందని.. నక్సలిస్టుల కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారస్తులు, బిల్డర్లు, సెలబ్రెటీల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.