10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 11) స్టేషన్ ఘన్‎పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్‎లో కేసీఆర్‎ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ ఆరా తీశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‎లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ది చెబుతారని అన్నారు. స్టేషన్ ఘనపూర్‎లోను ఉప ఎన్నిక వస్తుందని.. కడియం శ్రీహరి ఓడిపోయి మళ్లీ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. 

2023 నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పరాజయం చెందటంతో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్‎కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంక్రటావు, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేసి.. పార్టీ మార్పుకు గల కారణాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ నడుస్తోంది. సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని.. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పై విధంగా కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారాయి. మరీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై  సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.