హైదరాబాద్‎లోనే ఉన్నా.. అరెస్ట్​ చేసుకోండి: కేటీఆర్

హైదరాబాద్‎లోనే ఉన్నా.. అరెస్ట్​ చేసుకోండి:  కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తాను హైదరాబాద్​లోనే ఉన్నానని, అరెస్ట్​ చేస్తామంటున్న వాళ్లు వచ్చి చేసుకోవొచ్చని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్​ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్​లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ‘‘నేను హైదరాబాద్​లోనే ఉన్నాను. ఎక్కడికీ పోలేదు. మీ ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా వెల్​కమ్. 

వాళ్ల కోసం చాయ్, ఉస్మానియా బిస్కెట్లతో ఎదురు చూస్తుంటా. ఒకవేళ వాళ్లు మీ బర్త్​ డే కేకును కట్​ చేస్తామంటే నేనే ఇప్పిస్తా’’ అని పేర్కొన్నారు. తనను అరెస్ట్​ చేసేందుకు రేవంత్​ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారని, మరి మేఘా కృష్ణా రెడ్డిని అరెస్ట్​ చేసే దమ్ము ఆయనకుందా అని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘ఆ ఆంధ్రా కాంట్రాక్టర్​ని, తన ఈస్ట్​ ఇండియా కంపెనీని కొడంగల్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ టెండర్ల నుంచి తప్పించే దమ్ముందా? లేదా’’ అని నిలదీశారు.  

ఇక్కడ వదిలేసి అక్కడ పాదయాత్ర ఏంది..?

హైదరాబాద్​లో మూసీ బాధితులు ఉంటే.. నల్గొండలో మూసీ పరీవాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్​ రెడ్డి ఉద్దేశమేంటని కేటీఆర్​ప్రశ్నించారు. మోకాలికి దెబ్బ తగిలితే.. బోడి గుండుకు కుట్లు వేసినట్టుగా రేవంత్​ పాలన ఉందన్నారు. ‘‘కూల్చిన ఇండ్లు ఎక్కడ? కాలిన కడుపులెక్కడ? నువ్వు తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ? నువ్వు వేసిన ఎర్రరంగు మార్కింగ్​ ఎక్కడ? నువ్వు చేస్తున్న పాదయాత్ర ఎక్కడ? నీ కుట్రలకు అంబర్​పేట, అత్తాపూర్​ అతలాకుతలం అవుతుంటే నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ? నీ మూసీ దాహానికి అత్తాపూర్​ ఆగమైంది. గోల్నాక ఘొల్లుమంటున్నది. 

అయ్యా సంబరాల రాంబాబు.. నీ అన్యాయానికి ఆవేదనలు, ఆవేశాలు, ఆక్రందనలు వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి అక్కడ కాదు.. హైదరాబాద్‎కు రా.. ఇక్కడ చెయ్యి నీ పాదయాత్ర. తేలు మంత్రం రానోడు పాము కాటుకు మంత్రం వేసినట్టు.. పాలన తెలియని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్లో మన్ను పోసినవ్. నాయకత్వం అంటే కూల్చడం కాదు.. నిర్మించడం. తొవ్వతప్పడం కాదు.. తొవ్వ చూపించడం’’ అని వ్యాఖ్యానించారు.  ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారీ తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. ఎంత నిర్బంధించినా ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలులో వైఫల్యాలపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.