చండీఘర్: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(అక్టోబర్ 8) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మేం అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఫలితాలు తమను ఆశ్చర్యపర్చాయని.. ఈ రిజల్ట్స్ ఊహించనివి, దిగ్భ్రాంతికరమైనవని అభివర్ణించారు.
వాస్తవికతకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయన్న జైరాం రమేష్.. హర్యానా ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయన్నారు. హర్యానా ప్రజల అభీష్టాన్ని తారుమారు చేసిన ఈ ఫలితాలను అంగీకరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మూడు జిల్లాల నుండి లెక్కింపు ప్రక్రియ, ఈవీఎంల పనితీరుపై మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయని.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ ఫలితాల ద్వారా వ్యవస్థ విజయం సాధించి.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం దక్కించుకుంటోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఇవాళ (అక్టోబర్ 8) వెలువడిన ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో ముచ్చటగా మూడోసారి బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది.