ఓల్డ్ సిటీలో ఒలంపిక్ మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్: అక్బరుద్దీన్

ఓల్డ్ సిటీలో ఒలంపిక్ మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్: అక్బరుద్దీన్

హైదరాబాద్: ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ అన్నారు. నెహ్రు జూలాజికల్ జూ పార్క్-ఆరాంఘర్ మధ్య నిర్మించిన హైదరాబాద్‎లో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్‎ను 2025, జవనరి 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీ పరిధిలో 301 కోట్లతో సీవరేజ్ పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వర్షం నీరు, మురుగు నీరు కలవకుండా వేర్వేరు లైన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

 గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని గొప్పలు చెప్పింది.. కానీ చార్మినార్ పేడేస్ట్రియన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీకి ప్రతి రోజు వేల సంఖ్యలో టూరిస్ట్‎లు వస్తారని.. ఓల్డ్ సిటీని మరింత డెవలప్ చేస్తే టూరిజం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకొస్తామన్న టూరిజం పాలసీలో మక్కా మసీదుతో పాటు ఇతర మసీదు లను కూడా చేర్చితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో కూడా హై రైజ్డ్ అపార్ట్మెంట్ కల్చర్ వస్తుందని.. పాతబస్తీలో కొత్త బస్టాండ్లతో పాటు మినీ బస్సులను కూడా ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నానని అన్నారు.

గోషామహాల్‎లో కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టిసారించి.. త్వరగా పూర్తి చేయాలని కోరారు. సిటీలో ఉన్న స్టేడియాలను పొలిటికల్ పార్టీ మీటింగ్లకు మాత్రమే కాకుండా.. స్పోర్ట్స్ యాక్టివిటీస్‎ను పెంచే విధంగా మార్పు చేయాలని సూచించారు. ఓల్డ్ సిటీ నుండి ఒలంపిక్స్‎లో మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్ ఉన్నారని.. వారికి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరం.. ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారన్నారు. ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారని అన్నారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకువస్తోన్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా అక్బురుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు.