చెన్నూరు: మంత్రి పదవిపై చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీల ఐక్యత కోసం మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్రలో 2024, నవంబర్ 13న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. పాదయాత్ర మొదటి నుండి వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే వివేక్‌ను శాలువాతో సత్కరించి మాల మహానాడు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. కాకా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కానీ నేను మాలల మీటింగ్‌లలో పాల్గొంటే మంత్రి పదవి రాదేమో అని చాలా మంది అంటున్నారు. మంత్రి పదవి కంటే మాలల అభివృద్ధి, హక్కులే నాకు ముఖ్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వివేక్. మాలల ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు. మాలల హక్కుల సాధనకు సుధాకర్ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమని కొనియాడారు.
ALSO READ | మాలలు హక్కుల కోసం ఉద్యమించాల్సిన టైమొచ్చింది
మాలల హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్క మాల సభ్యులు బయటకి రావాలని.. మన హక్కులను పోరాడి సాధించుకోడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదారాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు మాలలు అందరూ హాజరై మన ఐక్యతను చాటుకోవాలని కోరారు. ఇక, మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్ మందమర్రి మండలాలకు చెందిన మాల కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.