వరంగల్, వెలుగు: హైదరాబాద్‍లో హైడ్రా పేరుతో అక్కినేని నాగార్జున వంటి పెద్దోళ్లను కొడితే పర్లేదు కానీ.. అమాయక పేదోళ్ల జోలికి రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఆదివారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడారు. చెరువు, పార్క్ భూములపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. అప్పట్లో వారికి పర్మిషన్ ఇచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్‍ఎస్ ఉనికి కోసం పోరాటం చేయడం తప్పించి కోలుకోవడం కష్టమన్నారు. రుణమాఫీపై రైతులు ధర్నా చేస్తే సీపీఐ తరపున మద్దతు ఇస్తామన్నారు.
గతంలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్ ప్రభుత్వం రుణమాఫీ సక్రమంగా చేయకుండానే, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‍పై రాళ్లు వేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీపై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి.. రూ.18,540 కోట్లు మాత్రమే మాఫీ చేసిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులతో కలిపి రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.
బీఆర్‍ఎస్‍ను వీడేందుకు ఆ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరే వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించవద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్, బీఆర్‍ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదానికే సరిపోయాయని చెప్పారు. రాష్ట్ర మంత్రుల్లో సమన్వయలోపం ఉందన్నారు. రాష్ట్రంలో మిత్రపక్షాలతో కొనసాగుతూనే.. ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు.
రాష్ట్రంలో కమ్యూనిస్టులు లేని కొరత కనిపిస్తోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, ఆర్‍ఎస్‍ఎస్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని.. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించే తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను సక్సెస్ చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బాలమల్లేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.విజయసారథి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, నేతలు మేకల రవి, సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, బాషామియా పాల్గొన్నారు.