హైదరాబాద్: ఒక్కరే కొట్లాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 26) హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండ రామ్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన మనం ఒక మార్పును తెచ్చుకున్నామన్నారు. ‘‘సంఘటితంగా పోరాడితే తెలంగాణ వచ్చింది. నేను ఒక్కడినే కొట్లాడిన, నేనే ఏలుకుంటా. నా కుటుంబం కోసం ఏలుకుంటా అన్నాడు. ఇవ్వాళ ఖజానా ఖాళీ అయింది’’ అని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించారు.
ఏ స్వార్థం లేకుండా తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటం చేశారని.. నిస్వార్ధంతో సిద్దిపేటలో 1500 రోజులు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని కానీ.. ఎమ్మెల్సీ రూపంలో ప్రభుత్వం కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణలోని వనరులు ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.