హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ పైనే మా మాలల పోరాటమని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన మాలల సింహగర్జన సభకు ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ALSO READ | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన.. భారీ ఏర్పాట్లు..
షెడ్యూల్ క్యాస్ట్లను ఆదుకోవాలని అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చారని.. ఆ రిజర్వేషన్ ఫలాల వల్లే సమాజంలో ఎస్సీలు కొంత ముందుకు వచ్చారని అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ మనల్ని ఇంకా వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను తూ.చా. తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెక్టార్లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్‌లోనూ రిజర్వేషన్లు ఉండాలన్నారు.
మాల, మాదిగ కులాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలనే ఈ సభ నిర్వహించామని తెలిపారు. అందరూ కలసి కట్టుగా ఉండాలని.. ఎస్సీల హక్కుల కోసం మాల మాదిగ సంయుక్త పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య ఐక్యత దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని.. సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల మాల మాదిగలు కలసి పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.