ఇది ఎన్నికల సభ కాదు.. ఒక యుద్ధం: సీఎం రేవంత్

ఇది ఎన్నికల సభ కాదు.. ఒక యుద్ధం: సీఎం రేవంత్

= తెలంగాణలో కులగణన పూర్తి
= పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం
= మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యం
= బీజేపీవి రాజ్యాంగ వ్యతిరేక విధానాలు
= స్వాతంత్రోద్యమాన్ని అవమానించేలా మోహన్ భగవత్ వ్యాఖ్యలు
=  అమిత్​ షా అంబేద్కర్ ను అవమానించారు
= రిజర్వేషన్లలో ఓబీసీలకు తీవ్ర అన్యాయం
= ఇండోర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
= ఇది ఎన్నికల సభ కాదు.. ఒక యుద్ధం: సీఎం రేవంత్

ఇండోర్:  కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, వారికి అండగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రిజర్వేషన్లలో ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు, ఓబీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతామని అన్నారు. ఇవాళ ఇండోర్ లో నిర్వహించిన  జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యమని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. స్వాతంత్రోద్యమాన్ని అవమానపర్చేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. 

అమిత్ షా సాక్షాత్తూ పార్లమెంటులోనే అంబేద్కర్ ను అవమాన పర్చారని అన్నారు. దేశంలో 90% మందికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదని, జనాభా దామాషా పద్ధతిలో  రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని రాహుల్ గాంధీ చెప్పారు. రిజర్వేషన్లలో ముఖ్యంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.  మోదీ ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను లూఠీ చేస్తోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ చెప్పారు.  

ఇది ఎన్నికల సభ కాదు యుద్ధం: సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు తామంతా రాహుల్ గాంధీ వెన్నంటి పోరాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ  కాదని, ఒక యుద్ధమని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ పరిణామాన్ని గ్రహించే పోరాడుతున్నారని చెప్పారు. గజనీ మహమ్మద్ హిందుస్థాన్‎ను దోచుకునేందుకు యత్నించినట్టు మోదీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పేరుతో కొనసాగుతున్న బ్రిటీష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ పోరాడుతున్నారని చెప్పారు. ఇది గాంధీ పరివార్, గాడ్సే పరివార్ ల మధ్య సాగుతున్న యుద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు.