న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. జనవరి చివరిలోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ చేస్తామని తెలిపారు. 2025, జనవరి 15వ తేదీన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి మహేష్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలనతో పాటు.. నామినేటేడ్, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, మంత్రి వర్గ విస్తరణ, లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం మహేష్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ ఉంటుందని తెలిపారు. సూర్యపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే.. గత కొంత కాలంగా పెండింగ్లో కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించామని తెలిపారు. ప్రజల్లో ఉన్న నేతలకే డీసీసీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్ధేశం చేశారని మహేష్ గౌడ్ తెలిపారు.