హైదరాబాద్: రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. బెటాలియన్ కానిస్టేబుళ్లను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. ఇతర పోలీసులకు దక్కిన గౌరవం తమ భర్తలకు దక్కడం లేదని నిరసన బాటపట్టారు. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. కానిస్టేబుళ్ల భార్యల ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రభుత్వం, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రభుత్వం, పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ALSO READ | చీర కొంగులో చిట్టీలు: గ్రూప్-1 మెయిన్స్‌లో పట్టుబడిన మహిళా అభ్యర్థిని
బెటాలియన్ కానిస్టేబుళ్లకు గతంలో జారీ చేసిన సెలవుల రద్దు ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు 2024, అక్టోబర్ 25న డీజీపీ జీవో జారీ చేశారు. సెలవుల రద్దు నిర్ణయం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరిగి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కానిస్టేబుళ్ల సమస్యలపై వారి కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సెలవుల విషయంలో గత ఆదేశాలను నిలిపివేయడంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట దక్కింది.