హైదరాబాద్: దీపావళి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, పెండింగ్ డీఏల విడుదలపై కీలక ప్రకటన చేసింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు నాలుగు గంటలు పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించారు.
పేదవాళ్లలో అతిపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల (అక్టోబర్) 31వ తేదీన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని శుభవార్త చెప్పారు. అలాగే.. దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక పెండింగ్ డీఏ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ గిరిజన వర్శిటీకి 211 ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణనను 2024, నవంబర్ 30లోపు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
మిల్లర్ల సమస్యలపై చర్చించామని.. వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మిల్లర్ల నుండి మిగులు బియ్యం సేకరణపై చర్చించాం.. బియ్యం సేకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 6 వేలకు పైగా ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. నాగోల్-ఎల్బీ నగర్- హయత్ నగర్ వరకు.. ఎల్బీ నగర్ నుండి శంషాబాద్ వరకు మెట్రో విస్తరిస్తామని వెల్లడించారు.