- నియోజకవర్గానికి 3,500 మంది నిరుపేదలు ఎంపిక
- వచ్చే నెల 4 లేదా 5 నుంచి కులగణన.. 30లోపు పూర్తి
- ఉద్యోగులకు ఒక డీఏ.. కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు : పేదలకు, ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుకలు ప్రకటించింది. మొదటి విడతలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. దీపావళి పండుగ నాడు అమావాస్య కావడంతో.. ఆ తర్వాతి రోజు, లేదంటే మరునాడు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయాలని నిర్ణయించింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలలో ఒకటి తక్షణమే రిలీజ్ చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 317 జీవో విషయంలోనూ స్పౌజ్, హెల్త్, మ్యూచువల్ బదిలీలను వెంటనే అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
స్థానికత విషయంలో 317 జీవో, కొత్త రిక్రూట్మెంట్కు సంబంధించి 46 జీవోపై అసెంబ్లీలో చర్చించిన తరువాత తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. అలాగే కులగణనకు సంబంధించిన ప్రశ్నావళికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి, మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు, రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటేరియెట్‌లో కేబినెట్ మీటింగ్ జరిగింది. దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఇస్తున్నం..
దీపావళి కానుకగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి కులం, మతం, పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నెల 30న దీపావళి నాడు అమావాస్య కావడంతో ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో మొదలుపెడతాం. మంత్రులమే స్వయంగా వెళ్లి ముగ్గు పోస్తాం” అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది.
ఉద్యోగులకు చాలా రోజులుగా డీఏలు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చాం. దీపావళి సందర్భంగా ఉద్యోగులందరికీ ఒక డీఏను ఇస్తాం. గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవో, 46 జీవోతో ఇబ్బందులు ఉన్నాయి. 317 జీవోకు సంబంధించి స్పౌజ్, హెల్త్, మ్యూచువల్బదిలీలకు ఆమోదం తెలిపాం. జీవో 46 సమస్యకు సంబంధించిన ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రానికి తీర్మానం పంపిస్తాం” అని తెలిపారు.
బ్యాంక్ గ్యారంటీలతోనే మిల్లర్లకు ధాన్యం..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పొంగులేటి తెలిపారు. ‘‘గతంలో రైస్‌మిల్లర్ల దగ్గర రూ.21 వేల కోట్ల స్టాక్మిగిలింది. దానిపై కేబినెట్ లో విస్తృతంగా చర్చించాం. మిల్లర్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాలు, విధానాలు అమలు చేశారో.. వాటిని స్టడీ చేసి ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించాం. మిల్లర్లు ఎవరికైతే క్లీన్చిట్ ఉందో వారిని ఫస్ట్
ప్రభుత్వం నోటీసు ఇచ్చిన తర్వాత పేమెంట్చేసినోళ్లను సెకండ్, నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ఆలస్యం చేసినోళ్లను థర్డ్ కేటగిరీగా విభజించాం. ఇప్పటికీ ఎవరైతే డిఫాల్టర్ఉన్నారో వారిని పూర్తిగా తీసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సేకరించే ధాన్యంలో వారి వారి క్యాడర్‌ను బట్టి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని ధాన్యం ఇస్తాం. మిల్లర్లకు ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తాం” అని వెల్లడించారు.
కొత్తగా రోడ్లు..
ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ఫోర్ లేన్ల రోడ్డు ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ, ప్రజల సౌకర్యార్థం పీపీపీ మోడ్‌లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘‘ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పనులు చేపడతాం.
ఆర్అండ్బీ, పంచాయతీ శాఖల్లో ఇంజినీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసినం. ఇతర రాష్ట్రాల్లో ఎలా పీపీపీ మోడల్లో పనులు చేస్తున్నారో అధ్యయనం చేసి డీపీఆర్రెడీ చేయాలని నిర్ణయించాం. ఈ రోడ్లకు దాదాపు రూ.25 వేల కోట్ల నుంచి రూ.28 వేల కోట్లు అవసరం అవుతాయి. వచ్చే నాలుగేండ్లలో పూర్తి చేస్తాం” అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గిరిజన వర్సిటీకి 210 ఎకరాలు..
ఉస్మానియా హాస్పిటల్కోసం గోషామహల్లో భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పొంగులేటి తెలిపారు. ‘‘ములుగులోని సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం కోసం 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్‌యూనివర్సిటీ కోసం గచ్చిబౌలి స్టేడియం వాడుకోవాలని నిర్ణయించాం. మధిర, హుజుర్నగర్, వికారాబాద్‌లలో స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఐటీఐలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోర్టుల్లో అవసరమైన స్టాఫ్‌ను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రిజర్వాయర్లలో పేరుకుపోయిన సిల్ట్ కారణంగా స్టోరేజీ కెపాసిటీ తగ్గుతున్నది. పైలట్ప్రాజెక్ట్కింద కడెం ప్రాజెక్టులో సిల్ట్ తొలగించాలని నిర్ణయించాం” అని చెప్పారు. ‘‘రూ.24,269 కోట్లతో మెట్రో రెండో ఫేజ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గం నుంచి కోకాపేట, ఎంజీబీఎస్నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్నుంచి పటాన్చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు 76.4 కిలోమీటర్ల మేర కొత్త మార్గం నిర్మిస్తాం. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్లో చేస్తాం. ఈ డీపీఆర్‌ను ఆమోదించాం. దాన్ని కేంద్రానికి పంపిస్తాం” అని పొంగులేటి వెల్లడించారు.
కులగణనకు 80 వేల మంది ఉద్యోగులు..
కులగణనకు సంబంధించిన విధివిధానాలు, ప్రశ్నావళికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లు, సర్వే నోడల్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెప్పారు. సుమారు 80 వేల మంది ఉద్యోగులకు ఈ సర్వేలో పాల్గొంటారని, వాళ్లందరికీ వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేస్తామ ని వెల్లడించారు. ‘‘నవంబర్ 4 లేదా 5 నుంచి సర్వే ప్రారంభమవుతుంది. అధికారుల బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తాయి. ఒక్కో బృందం 150 ఇండ్లను సర్వే చేస్తుంది.
ఇందుకోసం సుమారు నాలుగైదు రోజుల సమయం పడు తుంది. మొత్తంగా నవంబర్ 30లోపు సర్వే పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది” అని వెల్లడించారు. గత ప్రభుత్వం లెక్క హడావుడిగా ఒక్క రోజులో సర్వే చేసి, వాటిని దాచేసే ఉద్దేశం తమకు లేదన్నారు. అన్ని వివరాలతో సంపూర్ణంగా, సమగ్రంగా సర్వే ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు 2022 నుంచి ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒక డీఏ ఇస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.230 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన ఉద్యోగులు.. ఈ డీఏను సంతోషంగా స్వీకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.
కేబినెట్ నిర్ణయాలు
- జీవో 317కు సంబంధించి స్పౌజ్, హెల్త్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం
- ములుగులోని సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 210 ఎకరాలు
- పీపీపీ పద్ధతిలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం
- మెట్రో సెకండ్ ఫేజ్ డీపీఆర్‌కు ఆమోదం
- రిజర్వాయర్లలో పూడిక తీయాలని నిర్ణయం.. పైలట్ ప్రాజెక్టుగా కడెం
- రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు
- బ్యాంక్ గ్యారంటీలతోనే మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలని నిర్ణయం