ముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కి తీసుకున్న టీటీడీ.. తిరుమల బడ్జెట్ రూ.5 వేల 258 కోట్లు

ముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కి తీసుకున్న టీటీడీ.. తిరుమల బడ్జెట్ రూ.5 వేల 258 కోట్లు

అమరావతి: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముంతాజ్ ఒబిరై హోటల్‎కు కేటాయించిన 35.25 ఎకరాల భూమిని టీటీడీ వెనక్కు తీసుకుంటుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వేరే ప్రాంతంలో తిరిగి వాళ్లకి 50 ఎకరాల స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం (మార్చి 24) టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.

శ్రీ వెంకటేశ్వర జూపార్క్ నుంచి కపిల్ తీర్థం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. అదే తరహాలో టీటీడీ శ్రీవారికి సంబంధించినటువంటి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని తెలిపారు. టీటీడీ స్వామివారి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో టీటీడీ ఆలయ నిర్మాణాల కోసం శ్రీవాణి ట్రస్ట్ ఫండ్‎ను ఉపయోగిస్తామన్నారు. హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలని మరోసారి తీర్మానించామని తెలిపారు. 

అన్ని రాష్ట్రాల రాజధానిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని.. అలాగే గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో ఆలయాల పునరుద్ధరణపై తీర్మానం చేశామని చెప్పారు. శ్రీవారి పోటు వర్కర్స్ కు 43 వేల రూపాయలు జీఎస్టీ లేకుండా పాస్ చేసే విధంగా బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేశామని పేర్కొన్నారు. త్వరలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు చేస్తామన్నారు. సైన్స్‌ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.  రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు చేస్తామన్నారు. తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.