
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU)లో బీఈడీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పరీక్షకు కొన్ని నిమిషాల ముందే బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షా పత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పేపర్ లీక్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ మేరకు పేపర్ లీక్ తో సంబంధం ఉందని అనుమానిస్తోన్న ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం (మార్చి 8) అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కాగా, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఓ అనుబంధ కళాశాలలో శుక్రవారం జరగాల్సిన బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష పత్రం లీక్ అయ్యింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు పేపర్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూనివర్శిటీ అధికారులను ఆదేశించారు.
ALSO READ | వీల్చైర్ లేక ఆస్పత్రిపాలైన లెఫ్టినెంట్ జనరల్ భార్య..ఎయిర్ ఇండియాపై ప్యాసింజర్ల ఆగ్రహం
పేపర్ లీక్ అయిన పరీక్షను రద్దు చేయాలని సూచించారు. పేపర్ లీక్ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇందులో భాగాంగానే యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేపర్ లీక్ వ్యవహారంపై స్పందించారు. పరీక్షకు అరగంట ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది. ఎగ్జామ్ పేపర్‌ను వాట్సప్‌లో పంపిస్తారా..? పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శలు చేశారు.