హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు స్వల్ప ఊరట లభించింది. పోలీసుల ముందు హాజరు కావడానికి కోర్టు రెండు రోజుల టైం ఇచ్చింది. ఆ తర్వాత పోలీసుల విచారణకు హాజరు కావాలని కేసును విచారించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ సూచించింది. అయితే పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా జన్వాడ ఫాంహౌస్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న విజయ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాలేదు.
అయితే రెయిడ్ సమయంలో విజయ్ మద్దూరి తన మొబైల్ ఫోన్ దాచి పెట్టి వేరొక మహిళ ఫోన్ అందించినట్టు పోలీసులు గుర్తించారు. దాడులు జరిగిన సమయంలో తన పక్కనే ఉన్న భార్య నంబర్ అడిగితే థర్డ్ పర్సన్ నంబర్ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. కేటీఆర్ సతీమణిని పోలీసులు విచారించినట్టు సమాచారం. దాడులు జరుగుతున్న సమయంలోనే రాజ్ పాకాల పరారీ అయ్యారని చెబుతున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి నోరు విప్పితే అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.