
కేరళ రాష్ట్రంలో జరిగిన హత్యలు దేశాన్నే ఉలిక్కిపడేలా చేశాయి. ఓ మనిషిలో.. అందులోనూ 20 ఏళ్ల కుర్రోడిలో ఇంత క్రూరత్వం ఉందా.. ఇంత కిరాతకమైన ఆలోచనలు ఉన్నాయా అనే భయం.. దేశ ప్రజలను వణికించేలా చేస్తోంది. చిన్న తమ్ముడితో సహా మూడు కుటుంబాలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తీరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ఇంత దారుణమైన హత్యలు ఎప్పుడూ చూడలేదని విచారణ చేస్తున్న పోలీసులు సైతం అనటం.. ఈ కేసులోని క్రూరత్వాన్ని చెబుతోంది. హత్యలు చేసిన అఫ్సాన్ ఏదో ఆవేశంలోనో.. అప్పటికప్పుడు చేసింది ఏమీ లేదు. ఆరుగురిని చంపటం వెనక రెండు గంటల సమయం ఉంది.. 34 కిలోమీటర్ల ప్రయాణం ఉంది.. మూడు ఇళ్లు ఉన్నాయి.
వివరాల ప్రకారం.. పెరుమల నివాసి అఫ్సాన్ (23) మొన్నటి వరకు విదేశాల్లో ఉండి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అఫ్సాన్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో అర్థంకాక కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు.
ALSO READ | పల్టీలు కొట్టి పీస్ పీస్ అయిన కారు.. ప్రముఖ మహిళా ఈవెంట్ మేనేజర్ మృతి
బాబాయ్, పిన్ని, గర్ల్ ఫ్రెండ్ ఇలా అందరి దగ్గర డబ్బులు అడిగాడు. మొదట్లో వాళ్లు కొన్ని డబ్బులు ఇచ్చారు. మళ్లీ అడగడంతో ఈసారి డబ్బులు ఇవ్వలేదు. దీంతో వారిపై కక్ష పెంచుకున్నాడు అఫ్సాన్. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 23) డ్రగ్స్ సేవించి మత్తులో వారిని అంతమొందించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. వేర్వేరు చోట్ల ఉన్న వారిని గంటల వ్యవధిలోనే అతిదారుణంగా హత్య చేశాడు.
హంతకుడు అఫ్సాన్ మొదట పెరుమల నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని కల్లార పాంగోడ్ వచ్చాడు. అక్కడ తన అమ్ముమ్మ సల్మా బీవీని సుత్తితో కొట్టి చంపాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణించి చుల్లాలంకు చేరుకున్నాడు. అక్కడ తన బాబాయ్ లతీఫ్, పిన్ని షాహిదాను చంపేశాడు.
ఆ తర్వాత కల్లార పాంగోడ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని పెరుమలకు తిరిగి వచ్చాడు. అక్కడ తన తల్లి, తమ్ముడు, ప్రియురాలిని చంపేశాడు.
మూడు ఇళ్లల్లో రెండు గంటల్లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత.. తీరిగ్గా ఆటోలో వెంజరమూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ లొంగిపోయాడు. హత్యలు చేశానని చెబితే మొదట పోలీసులు సైతం నమ్మలేదు. అఫ్సాన్ చెప్పిన విషయం విని ఖంగుతిన్న పోలీసులు.. అ తర్వాత తేరుకుని నిందితుడి చెప్పిన వివరాల ఆధారంగా మూడు వేర్వేరు చోట్లకు వెళ్లి చూడగా అక్కడ ఐదుగురు మృతి చెంది కనిపించారు. నిందితుడి తల్లి మాత్రం కొస ప్రాణాలతో కొట్టామిట్టాడుతుండటంతో పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ దారుణ హత్యలకు గల కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదన్న కారణంగానే అఫ్సాన్ సామూహిక హత్యలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటి వరకు గానూ హత్యలకు కారణం ఏంటన్నది స్పష్టంగా తెలియదని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.