‘ల్యాండ్ మాఫియా కోసమే తుపాకీ’.. గాజులరామారంలో కాల్పుల కేసులో కీలక విషయాలు

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పరిధిలోని గాజులరామారం కాల్పుల ఘటనలో ఎట్టకేలకు బీఆర్ఎస్ నేత నరేశ్‎ను పోలీసులు పట్టుకున్నారు. కేసులో మొత్తం 15మందిని అరెస్ట్​ చేసినట్లు మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. బాచుపల్లికి  చెందిన చేబ్రోలు పూర్ణిమ (35), మల్లంపేటకు​చెందిన అజయ్ చంద్ర (21), గౌతమ్​ (24) కలిసి ఈ నెల 28న అర్ధరాత్రి మల్లంపేట నుంచి గాజులరామారానికి బైక్ పై బయలుదేరారు. మార్గమధ్యలో బైక్ ఆగిపోగా, ఎల్ఎన్​ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పార్క్ చేసిన మరో బైక్​నుంచి పెట్రోల్ దొంగతానికి ప్రయత్నించారు. గమనించిన బార్ క్యాషియర్ అఖిలేశ్ వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు. 

గొడవ పెద్దది కావడంతో పూర్ణిమ మల్లంపేటకు చెందిన బీఆర్ఎస్ నేత నరేశ్, శివకు ఫోన్​చేసింది. కాసేపటికే వారిద్దరూ థార్ వాహనంలో సంఘటనా స్థలానికి వచ్చారు. వెనకాలే నరేశ్​ఫ్రెండ్స్​సోహైల్, శాంసన్, నరేందర్, ఉజ్వల్ సైతం​బెలేనో  కారులో వచ్చారు. గొడవ మరింత ముదరడంతో నరేశ్ తనతో వచ్చిన శివను గన్ తో ఫైర్ చేయమని చెప్పాడు. అతను బార్​నిర్వాహకులపై కాల్పులు జరపగా, వారంతా తప్పించుకొని పారిపోయారు. ఆపై నరేశ్ తన థార్ వాహనంతో ఢీ కొట్టడంతో బార్ ఓనర్ నిశాంత్​కు గాయాలయ్యాయి. 

దాడి చేసిన వారే ఉల్టా పోలీసులకు ఫిర్యాదు 

కాల్పులు జరిపిన అనంతరం బార్ నిర్వాహకులు తనపై దాడి చేశారని గౌతమ్‎తో నరేశ్​తప్పుడు ఫిర్యాదు ఇప్పించాడు. పోలీస్ స్టేషన్​ వద్ద హంగామా సృష్టించి, బార్​నిర్వాహకులను బూతులు తిడుతూ చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు అఖిలేశ్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి తమపై కాల్పులు జరిపారని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, పూర్ణిమ, గౌతమ్, అజయ్ చంద్ర, సోహెల్, శాంసన్, నరేందర్, ఉజ్వల్ లను అదుపులోకి తీసుకొని విచారించినట్లు డీసీపీ తెలిపారు. 

ల్యాండ్ మాఫియా నడపడం కోసమే గన్ 

ఈ కేసు విచారణలో అనేక వివరాలు బయటపడ్డాయి. ల్యాండ్​మాఫియాను నడపడానికే నరేశ్​ఒక నెల క్రితం తన స్నేహితులైన సమీర్, పల్లె బుగ్గప్ప, శ్రీకరణ్, జగ్గు, శివ మహంతితో బీహార్‎కు వెళ్లి మరో వ్యక్తి అమిత్ సహాయంతో నాటు తుపాకీతోపాటు100 బుల్లెట్లను రూ. 80 వేలకు కొన్నాడు.  రియల్ఎస్టేట్ వ్యాపారం పేరుతో  కబ్జాలు చేసే వ్యక్తిగా పేరున్న నరేశ్ తన దందాకు ఎవరైనా అడ్డొస్తే బెదించడానికి తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

వీరితోపాటు కాల్పులు జరిపిన తుపాకీని శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద దాచడంతో పోలీసులు అతణ్ని కూడా అరెస్టు చేశారు. కూకట్​పల్లిలో స్కోడా కార్ లో తిరుగుతున్న నరేశ్, సమీర్​లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి మొత్తంగా 87 బుల్లెట్లు, తుపాకీ, కత్తి, వాహనం స్వాధీనం చేసుకున్నాడు. నరేశ్ పై సంగారెడ్డి లో ఒక కేసు, దుండిగల్ పీఎస్ లో నాలుగు కేసులు ఉన్నట్లుగా డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.