హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్ఫ 2 ప్రీమియర్ షో సంద్భరంగా జరిగిన పరిణామాలతో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
ఈ పిటిషన్పై 2025, జనవరి 24 హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను 2025, ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో నిర్మాతలకు బిగ్ షాకే అంటున్నారు సినీ ప్రముఖలు.