కవ్వాల్ టైగర్ జోన్‌‌‌‌లో... కీలక పోస్టులు ఖాళీ

కవ్వాల్ టైగర్ జోన్‌‌‌‌లో...  కీలక పోస్టులు ఖాళీ
  • ఏండ్లుగా ఇన్‌‌‌‌చార్జులతోనే నెట్టుకొస్తున్న వైనం
  • ఎనిమిది ఎఫ్‌‌‌‌డీవో పోస్టులకు ఆరు ఖాళీ
  • ఆరు ఎఫ్ఆర్‌‌‌‌వో, 45 శాతం బీట్ ఆఫీసర్లు పోస్టులు సైతం..
  • సవాల్‌‌‌‌గా మారిన అడవులు, పెద్దపులుల రక్షణ

మంచిర్యాల, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్‌‌‌‌ టైగర్‌‌‌‌ జోన్‌‌‌‌ పరిధిలో కీలక పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అటవీ రక్షణలో ప్రధానమైన ఫారెస్ట్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ఆఫీసర్ (ఎఫ్‌‌‌‌డీవో), రేంజ్‌‌‌‌ ఆఫీసర్ల (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వో)తో పాటు సుమారు 45 శాతం బీట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌బీవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో రెగ్యులర్‌‌‌‌ ఆఫీసర్లను భర్తీ చేయకపోవడంతో ఇన్‌‌‌‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. ఉన్న వారికి ఒకటి కంటే ఎక్కువ డివిజన్ల బాధ్యతలను అప్పగించడంతో పనిభారం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల రక్షణపై ఫోకస్‌‌‌‌ చేయలేకపోతున్నారు.

ఎనిమిది ఎఫ్‌‌‌‌డీవో పోస్టులకు ఆరు ఖాళీ

ఫారెస్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ డివిజన్‌‌‌‌ స్థాయిలో ఎఫ్‌‌‌‌డీవో పోస్టులు ఎంతో కీలకమైనవి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడంలో వీరిదే ప్రధాన పాత్ర. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన ఎఫ్‌‌‌‌డీవో పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాది జులైలో ఫారెస్ట్ ఆఫీసర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లు జరిగినప్పటికీ ఈ జిల్లాకు రావడానికి ఎవరూ ఇంట్రస్ట్‌‌‌‌ చూపలేదు. 

దీంతో కవ్వాల్‌‌‌‌ టైగర్‌‌‌‌ జోన్‌‌‌‌ పరిధిలో ఎనిమిది ఎఫ్‌‌‌‌డీవో పోస్టులకుగానూ ఆరు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. టైగర్ జోన్ కేంద్రమైన జన్నారం డివిజన్‌‌‌‌కు ఏడాదిన్నరగా ఎఫ్‌‌‌‌డీవో లేకపోవడంతో ముఖ్యమైన పనులు కుంటుపడుతున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన సిరికొండ మాధవరావు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కావడంతో ఆ పోస్టులో రెగ్యులర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ను నియమించలేదు. అప్పటినుంచి మంచిర్యాల జిల్లా ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ శివ్‌‌‌‌ ఆశిష్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. బెల్లంపల్లికి సైతం ఆయనే ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎఫ్‌‌‌‌డీవో పోస్ట్‌‌‌‌ రెండున్నర సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండడంతో ఇన్‌‌‌‌చార్జితోనే నెట్టుకొస్తున్నారు. జూలైలో జరిగిన బదిలీల్లో చెన్నూర్ ఎఫ్‌‌‌‌డీవో బదిలీ కావడంతో మంచిర్యాల ఎఫ్‌‌‌‌డీవో సర్వేశ్వర్‌‌‌‌కు ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 

ఆసిఫాబాద్‌‌‌‌ ఎఫ్‌‌‌‌డీవో పోస్టు రెండేండ్ల నుంచి ఖాళీ ఉండగా ప్రస్తుతం ఆ జిల్లా ఎఫ్‌‌‌‌డీవో నీరజ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిగా ఉన్నారు. ఖానాపూర్‌‌‌‌ ఎఫ్‌‌‌‌డీవో పోస్ట్‌‌‌‌ ఏడాది నుంచి ఖాళీగా ఉండడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎఫ్‌‌‌‌డీవో భవానీ శంకర్‌‌‌‌కు ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ బాధ్యతలు అప్పగించారు. ఉట్నూర్, కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ డివిజన్లకు నియమామకమైన ఐఎఫ్ఎస్‌‌‌‌లు ట్రైనింగ్‌‌‌‌లో ఉన్నారు.

ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వో, ఎఫ్‌‌‌‌బీవోలు సైతం..

ఫారెస్ట్ డిపార్టమెంట్‌‌‌‌ క్షేత్రస్థాయిలో కీలకమైన ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వో, ఎఫ్‌‌‌‌డీవో పోస్టులు ఖాళీగా ఉండడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎఫ్ఆర్‌‌‌‌వోలు కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, ఆసిఫాబాద్‌‌‌‌, మంచిర్యాల, ఖానాపూర్‌‌‌‌లో ఒక్కో పోస్ట్‌‌‌‌ ఖాళీగా ఉండగా, జన్నారం డివిజన్‌‌‌‌లో రెండు వేకెంట్ ఉన్నాయి. బీట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టుల్లో దాదాపు 45 శాతం ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన గ్రూప్స్‌‌‌‌లో 10 నుంచి 15 మంది సెలెక్ట్ కావడంతో ఆ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి.

అడవులను కాపాడేదెవరు ?

ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. రాష్ట్రంలో ఉన్న రెండు టైగర్ జోన్లలో ఒకటైన కవ్వాల్‌‌‌‌ ఇక్కడే ఉంది. ఉమ్మడి జిల్లా అడవుల్లో ఇటీవల పులి కదలికలు పెరిగాయి. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌‌‌‌ జోన్ల నుంచి పులులు కవ్వాల్‌‌‌‌కు వచ్చిపోతున్నాయి. ఈ క్రమంలో వాటికి భద్రతను కల్పించి, నిత్యం పర్యవేక్షించాల్సిన ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడం సమస్యగా మారింది. ఖానాపూర్, జన్నారం డివిజన్ల పరిధిలోని గ్రామాల తరలింపు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేగాకుండా అడవుల్లో గుట్టుగా సాగుతున్న వన్యప్రాణుల వేట, కలప స్మగ్లింగ్‌‌‌‌ను కంట్రోల్ చేసే అవకాశం లేకుండా పోతోంది.