ఖమ్మం: మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. మాలలను తక్కువ అంచనా వేస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇకపై మాలల ముసుగులు వేసుకొని కూర్చుంటే కలవదని.. అందరు ఒక తాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. అలాగే మాలలు ప్రత్యేక సంఘాలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యే వివేక్ సూచించారు. 2024, నవంబర్ 15వ తేదీన ఖమ్మంలో మాల, మాల ఉపకులాల ఆత్మీయ సమ్మేళేనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అన్ని కులాల వారు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం పెట్టని వారు.. మాల సమావేశానికి అభ్యంతరం తెలుపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మా జాతి సంక్షేమం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు. మాల కులానికి చెందినవారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావాలని కోరితే ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చారని తెలిపారు. నేను మంత్రి పదవి కోసం మాల నినాదం ఎత్తుకోలేదని.. మాలలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్యమంలో ముందుండాలనేదే తన ఆలోచని అని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశానన్నారు. కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే వాళ్లు నేనంటే భయపడుతున్నారని అన్నారు.
నాగరాజు, వివేక్ని తప్పిస్తే మాల ఉద్యమం నడవదని కొందరు భావిస్తున్నారని.. కానీ నేను ఎవడికి భయపడనని.. నేను ఏదైనా పద్దతి ప్రకారం చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సమయంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టించాడని.. అయిప్పటికీ బెదరలేదన్నారు. కేసీఆర్ కూడా తనను తీవ్రంగా వేధించాడు.. నా టీవీ ఛానల్ సంస్థకు రూ.150 కోట్ల ప్రకటనలు రాకుండా చేశాడు.. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా కేసీఆర్ అవినీతిని ఎండగట్టానన్నారు. ఆత్మ గౌరవం లేని చోట మనం ఉండకూడదని నా తండ్రి నేర్పాడని.. తాను అదే ఫాలో అవుతానని స్పష్టం చేశారు.
మాజీ సీఎం సంజీవయ్య స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని.. తన తండ్రి వెంకటస్వామి సంజీవయ్య ఫాలోవర్ అని చెప్పారు. మాలలు, పేదల కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి కొట్లాడేవారని గుర్తు చేశారు. వెంకటస్వామి తన ఇంటి పేరును గుడిసెల వెంకటస్వామిగా మార్చుకున్నారని గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ లో జరిగిన మాలల సమావేశం చాలా సక్సెస్ అయ్యిందని.. ఈ సభ చూసి కొందరికి భయం పట్టుకుందన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమాన్ని కూడా అంతే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.