- జగిత్యాల రాజకీయాల్లో కీలక మలుపులు
- ఐదేండ్లలో బల్దియాలో ముగ్గురు చైర్పర్సన్ల మార్పు
- కమిషనర్లపై అవినీతి, భూకబ్జా ఆరోపణలు.. పలువురిపై వేటు
- బల్దియా పాలనపై తీవ్ర ప్రభావం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల బల్దియా ఐదేండ్ల పాలనలో కీలక పరిణామాలు జరిగాయి. వీటి ప్రభావం జగిత్యాల రాజకీయాలపై పడింది. మూడు రోజుల కింద పాలకవర్గం గడువు ముగిసింది. ఈ ఐదేళ్లలో ఏకంగా ఇద్దరు చైర్పర్సన్లు.. ఒక ఇన్చార్జి చైర్మన్ మారడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు ఏడాదికి ఇద్దరు కమిషనర్ల చొప్పున మారారు. ఇందుకు అవినీతి, భూ కబ్జాల ఆరోపణలు కారణం కాగా.. రాజకీయ ఒత్తిళ్లు కూడా పనిచేశాయన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పలువురు కమిషనర్లపై ప్రభుత్వం వేటు కూడా వేసింది. మూడు సార్లు ఏసీబీ దాడులు, ఒకసారి విజిలెన్స్ సోదాలు సైతం జరిగాయి. వరుస ఘటనలతో జగిత్యాల అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.
ఒకే టర్మ్ లో 12 మంది కమిషనర్లు..
2019 మున్సిపల్ ఎన్నికల తర్వాత ఐదేండ్లలో జగిత్యాలలో ఏకంగా 12 మంది కమిషనర్లు మారడం గమనార్హం. తొలుత కమిషనర్ లచ్చిరెడ్డి వచ్చారు. ఆ తర్వాత 2020లో పూర్తిస్థాయి కమిషనర్ గా జయంత్ రాగా కొన్ని రోజులకే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. దీంతో కోరుట్ల బల్దియా కమిషనర్ ఆయాజ్‌కు, ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీకి అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. అనంతరం మారుతి ప్రసాద్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించగా, ఏసీబీ దాడులతో ఏడాది తర్వాత బదిలీపై వెళ్లారు. 2021లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత స్వరూప రాణికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.
ఆమె కూడా లాంగ్ లీవ్ పెట్టి వెళ్లడంతో గోపు గంగాధర్ కమిషనర్‌గా వచ్చారు. రాజకీయ ఒత్తిళ్లతో ఆయన బదిలీపై వెళ్లగా 2022లో డీఈ రాజేశ్వర్‌కు ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. 2023లో డీడబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న బోనగిరి నరేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించగా.. ఆ తర్వాత అనిల్ బాబు వచ్చారు. భూకబ్జా ఆరోపణలతో ఆయన సస్పెండ్ అయ్యారు. 2024 లో రాయికల్ ఎంపీడీవో చిరంజీవికి బాధ్యతలు అప్పగించగా, కొన్ని రోజులకు సమ్మయ్య వచ్చారు. ఈయనను కూడా వివిధ ఆరోపణలతో సరెండర్ చేయగా.. రాయికల్ ఎంపీడీవో చిరంజీవికే మళ్లీ బాధ్యతలు అప్పగించారు.
విజిలెన్స్ ఎంక్వైరీలు
2020లో జగిత్యాల బల్దియా అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ బాలనంద స్వామి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ రాములు.. బిల్డింగ్ పర్మిషన్ కోసం డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 2021లో బల్దియా రెవెన్యూ ఆఫీసర్ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్‌పై ఏసీబీ సుమోటోగా కేసు నమోదు చేయడంతో సస్పెండ్ అయ్యారు. 2023లో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ సెక్షన్లలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యం లో విజిలెన్స్ ఆఫీసర్లు ఎంక్వైరీ నిర్వహించారు.
పాలనపై తీవ్ర ప్రభావం
ఒకే టర్మ్‌లో 12 మంది కమిషనర్లు మారడం బల్దియా పాలనపై తీవ్ర ప్రభావం చూపించింది. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ఆరేళ్లుగా టీయూఎఫ్ఐడీసీ కింద మూడు విడతల్లో రూ.75 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 50 శాతం మాత్రమే ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. రూ.34.59 కోట్లకు సంబంధించిన పనులు అసంపూర్తిగా మిగలగా, మొదట విడతలో రూ. 2.20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మా ణాలు ప్రారంభానికి నోచుకోలేదు.
రెండో విడతలో రూ.2.39 కోట్లతో బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని భావించినా టెండర్లు పూర్తి కాలేదు. ఇందులోనే రూ.5 కోట్లతో కమ్యూనిటీ భవనాలు, గ్రేవ్ యార్డు నిర్మించాల్సి ఉండగా వీటికి టెండర్లు సైతం నిర్వహించ లేదు. ఇక మూడో విడతలో రూ.25 కోట్లకు సంబంధించి నల్లగుట్ట వద్ద డంపింగ్ యార్డు అభివృద్ధి పనులు వాయిదా వేశారు.
ఐదేండ్లలో ముగ్గురు మున్సిపల్ చైర్పర్సన్లు
2019 లో తొలిసారి జగిత్యాల బల్దియా పీఠంపై అప్పటి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. దీంతో బోగ శ్రావణి చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ విభేదాలతో 2023 జనవరిలో శ్రావణి బీఆర్ఎస్కు రాజీనామా చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆమెకు బీజేపీ తరఫున టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వైన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.
ఈక్రమంలో అనేక రాజకీయ హైడ్రామాల మధ్య 2024 ఫిబ్రవరిలో బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ అడువాల జ్యోతి చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే టర్మ్‌లో ముగ్గురు చైర్పర్సన్లు/చైర్మన్ మారారు.