ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గుట్టపై ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ హాస్టల్ బిల్డింగ్‌లోకి ఆదివారం రాత్రి కొందరు ఆకతాయిలు చొరబడ్డారు. వారిని చూసిన ముగ్గురు బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. హాస్టల్సిబ్బంది బాలికలను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ సోమవారం ఉదయం హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. హాస్టల్లోని 340 మంది బాలికలకు కనీస భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు.
సమాచారం అందుకున్న డీఈఓ సోమశేఖర శర్మ, ఎంఈఓ శ్రీనివాసరావు, జీసీడీఓ భూలక్ష్మి హాస్టల్పరిశీలించారు. అనంతరం డీఈఓ సోమశేఖరశర్మ మాట్లాడుతూ.. గతంలో ఇలాగే నాలుగు సార్లు ఆకతాయిలు హాస్టల్లోకి వచ్చారని బాలికలు హాస్టల్ ఎస్ఓ జ్యోతికి చెప్పినా పట్టించుకోలేదని తెలిసిందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. గల్లా సత్యనారాయణ, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. హాస్టల్కాంపౌండ్పై ఫెన్సింగ్లేకపోవడంతోనే ఆకతాయిలు చొరబడ్డారన్నారు. బాలికలు స్నానం చేసే సమయంలో గుట్టపై నుంచి కొందరు వెకిలి చేష్టలు చేస్తున్నారని చెప్పారు. హాస్టల్ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్హల్చల్చేస్తోందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అధికారులు స్పందిస్తూ దసరా సెలవుల్లో హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు శాంతించారు.