కేజీబీవీ కార్మికుల శ్రమకు విలువేది!: గంట నాగయ్య

దేశంలో బాలికల విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను నెలకొల్పింది. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్నాయి. కేజీబీవీలు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రాథమిక విద్యలో బాలికల విద్యాభివృద్ధి బాగా మెరుగైంది. కానీ కేజీబీవీల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు సేవలందించే సిబ్బంది ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేజీబీవీల నిర్వహణలో నాన్ టీచింగ్ వర్కర్స్ పాత్ర ముఖ్యమైనది. స్టూడెంట్స్​కు అన్ని రకాల ఆహార పదార్థాలను మూడు పూటల తయారు చేసి అందించడం, కేజీబీవీల నిర్వహణ, బాలికల రక్షణలో వీరు సేవలందిస్తున్నారు. ఇలా బాలికల సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వర్కర్స్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అలసత్వం వహిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ జీవితాలు బాగుపడతాయని  ఆశిస్తే, కేసీఆర్ ప్రభుత్వం కేజీబీవీ నాన్​ టీచింగ్​ స్టాఫ్​ పట్ల చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నది. కనీస వేతనాలు లేక, ఉద్యోగ భద్రత కల్పించక, గుర్తింపు కార్డులు ఇవ్వక నాన్​టీచింగ్​ స్టాఫ్​అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలు, డిమాండ్లపై వివిధ సందర్భాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఆంధ్రప్రదేశ్​లో మంచి సౌకర్యాలు

తెలంగాణతో పోలిస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కేజీబీవీల్లో కార్మికులకు ఎక్కువ వేతనాలు అందుతున్నాయి. పీఎఫ్ లాంటి సౌకర్యం వారికి అమలు చేస్తున్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని ప్రభుత్వం ప్రకటించుకుంటున్నప్పటికీ, కేజీబీవీల వర్కర్స్ కు కనీస వేతనాలను అమలు చేయకపోగా, సమస్యలకు పరిష్కార మార్గం కూడా చూపడం లేదు.  రాష్ట్రంలో 475 పైగా కేజీబీవీలు, జిల్లాకో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. రెండేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 95  కేజీబీవీ విద్యా సంస్థలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేసింది. దీంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. కానీ పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాన్ టీచింగ్ వర్కర్స్ ను నియమించకపోవడంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగింది. చాలీచాలని వేతనాలతో పనిచేయలేక కొందరు మానేస్తే, మరికొందరు కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. అలా ఖాళీలు ఏర్పడిన ప్రాంతాల్లో కార్మికుల పోస్టులు ఇప్పటికీ నింపలేదు. ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదు. ఉదాహరణకు నల్గొండ జిల్లా చండూరు కేజీబీవీని ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ 29 తరగతి గదులు, 12 హాస్టల్ గదులు, 40 మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండగా, వీటిని ప్రతి రోజు శుభ్రం చేయాలంటే కనీసం నలుగురు సిబ్బంది కావాలి. కానీ అందుకు భిన్నంగా ఇద్దరు స్వీపర్స్ మాత్రమే ఉన్నారు. మరుగుదొడ్లను యాసిడ్ తో కడిగినప్పుడు ఆ వాసన ముక్కులోకి వెళ్లి ఊపిరాడటం లేదు. 

వేతనాలు తక్కువ.. పని ఎక్కువ

హాస్టల్ లో టిఫిన్స్ చేసినప్పుడు సరిపోను వర్కర్స్ లేక ఆలస్యం అవుతున్నది. దీనికి వర్కర్లను బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా కేజీబీవీల్లో కుక్, స్విపర్, స్కావేంజర్, అటెండర్, నైట్, డే వాచ్ ఉమెన్, హెల్పర్ లకు రూ.14203, ఏఎన్ఎం, అకౌంటెంట్ కు రూ .17,775, పార్ట్ టైం ఉద్యోగులకు రూ.14000 చెల్లిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం వర్కర్లకు రూ. 9,750, ఏఎన్ఎం, అకౌంటెంట్లకు రూ.14000, పార్ట్ టైం ఉద్యోగులకు రూ.7,500 ఇస్తున్నది. ఇలా కార్మికులు తక్కువ వేతనాలకు ఎక్కువ పనిచేస్తున్నారు. పైగా తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలనే బెదిరింపు ఒకటి. కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర మహా సభ జరగనుంది. కార్మికులు దీనికి పెద్ద ఎత్తున హాజరై, మన సమస్యలపై బలమైన గళం వినిపించాల్సిన అవసరం ఉన్నది.

- గంట నాగయ్య,
రాష్ట్ర అధ్యక్షుడు, 
కేజీబీవీ  నాన్​ టీచింగ్ ​వర్కర్స్