హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి స్టార్ట్ అయ్యింది. ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు ఇవాళ (సెప్టెంబర్ 7) తొలి పూజ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. మండపాలు, మైకుల సౌండ్‌తో గల్లీ గల్లీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజకు సిద్ధమయ్యాడు.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణపతికి తొలి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తొలి పూజలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీనికి ముందు ఉదయం 8 గంటలకు పద్మశాలి సంఘం జంజం, ప్రత్యేకంగా తయారు చేసిన కండువా గణనాథుడికి సమర్పించారు.
ఇక్కడి నుండి గణనాథుడి పూజ కార్యక్రమాలు షూరు కానున్నాయి. సీఎం, మంత్రులు, గవర్నర్ రాకతో పాటు తొలి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వినాయకుడిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించడంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షం పడ్డ భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు.
బడా గణనాథుడి ప్రత్యేకతలు
ఇక, ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుడు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహకులు ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్‌ను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పర్యావరణ కాలుష్య నేపథ్యంలో గత రెండేళ్లుగా పూర్తిగా మట్టితోనే ఖైరతాబాద్ గణపతిని తయారు చేస్తుండగా.. ఈ సారి కూడా ఇదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు.
పూర్తిగా మట్టితో కూడిన ఎకో ఫ్రెండ్లీ గణనాథుడిని సిద్ధం చేశారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ప్రతిష్టించగా.. గణనాథుడి విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహన్ని ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో ఈ ఏడాది బడా గణపతి విగ్రహ ఏర్పాటు పనులు ఆలస్యంగా స్టార్ అయ్యాయి. అయినప్పటికీ తక్కువ సమయంలోనే ఉత్సవ కమిటీ విగ్రహ నిర్మాణాన్ని కంప్లీట్ చేయించింది.
also read : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
బడా గణనాథుడి విగ్రహా తయారీలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 190 మంది కళాకారులు పాల్గొని విజయవంతంగా గణపయ్య విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. గతేడాది బడా గణేష్ ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది. ఈ మేరకు భక్తుత సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేశారు.